కంపెనీలు మటాష్ : GST దెబ్బతో మూతపడుతున్న మనీ గేమింగ్ యాప్స్

కంపెనీలు మటాష్ : GST దెబ్బతో మూతపడుతున్న మనీ గేమింగ్ యాప్స్

ఒకే ఒక్క దెబ్బ.. అది కూడా అలాంటి ఇలాంటి దెబ్బ కాదు.. జీఎస్టీ దెబ్బ. ఇన్నాళ్లు జీఎస్టీ పరిధిలోకి రాని ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు.. నెటిజన్లకు డబ్బులు ఎరవేసి.. తమ వ్యాపారాలను ఎంతో చక్కగా నిర్వహించాయి. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో వాటాను ఆన్ లైన్ కస్టమర్లకు పంచుతూ.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా లాభాలు గడించాయి. వేలాది మందికి ఉపాధి కల్పించాయి. మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీలోని మార్పులతో.. ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలు అన్నీ 28 శాతం జీఎస్టీ పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇక్కడే అసలు సిసలు సినిమా వాళ్లకు కనిపించింది. 

28 శాతం జీఎస్టీతో కంపెనీలకు మిగిలేది ఏమీ లేదంటూ మొన్నటికి మొన్న మొబైల్ ప్రీమియర్ లీగ్. (MPL) గేమింగ్ కంపెనీ 350 మంది ఉద్యోగులను తీసివేసింది. ఇదే బాటలో ఇప్పుడు రష్ గేమింగ్ యూనివర్స్ కంపెనీ సైతం లేఆఫ్స్ ప్రకటించింది. ప్రస్తుతానికి 55 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరిన్ని ఖర్చులు తగ్గించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగులకు లేఖలు రాసింది కంపెనీ యాజమాన్యం.

రష్ గేమింగ్ యూనివర్స్ కంపెనీ మొబైల్ గేమింగ్ యాప్స్ తయారీలో ఉంది. అదే విధంగా ఆన్ లైన్ గేమ్స్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ తన ఆదాయంలో 28 శాతం జీఎస్టీ కట్టాల్సి రావటంతో.. లాభాలు రాకపోగా.. కంపెనీ నిర్వహణ కష్టంగా ఉంటుందని స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలోనే మొదటి విడతగా 55 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది కంపెనీ. 

ఇప్పుడిప్పుడు మార్కెట్ లో నిలదొక్కుకుంటున్న గేమింగ్ కంపెనీలు అయితే పూర్తిగా మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. 28 శాతం జీఎస్టీతో గేమింగ్ పరిశ్రమలను నడపటం కష్టమంటూ వ్యాఖ్యానించారు ఇన్వెస్టర్ అనిరుధ్ దమాని. గేమింగ్ పరిశ్రమలో అత్యధిక పన్నులు అనేది.. చాలా మంది ఉపాధిని దెబ్బతీస్తుందని స్పష్టం చేశారాయన. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల తొలగింపుతో నిలదొక్కుకున్నా.. రాబోయే రోజుల్లో గేమ్స్ లో పాల్గొనే వారికి ఇచ్చే నగదు బహుమతుల్లో భారీ కోత విధిస్తాయని వెల్లడించారాయన. దీని వల్ల కస్టమర్లను కోల్పోవాల్సి వస్తుందని అంచనా వేశారాయన. 

చిన్న, మధ్య తరహా గేమింగ్స్ కంపెనీలు అన్నీ మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు గేమింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ అనిరుధ్ దయాని.