లిస్ట్​ ఇంకా ఫైనల్​ కాలే!.. బీసీ ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎదురుచూపులు

లిస్ట్​ ఇంకా ఫైనల్​ కాలే!.. బీసీ ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎదురుచూపులు
  • ఎమ్మెల్యేల ఆమోదం కోసం వెయిటింగ్​
  • అప్లికేషన్ల స్వీకరించి నెలరోజులు పూర్తి
  • కామారెడ్డి జిల్లాలో 17,282 దరఖాస్తులు

కామారెడ్డి, వెలుగు: బీసీల్లోని చేతి వృత్తులు, కుల వృత్తులవారికి రూ.లక్ష ఆర్థిక సాయం  కోసం అప్లికేషన్ల స్వీకరించి నెల దాటినా లిస్ట్​ఇంకా ఫైనల్​కాలేదు. ఆఫీసర్ల క్షేత్రస్థాయి పరిశీలన ముగిసినా, లిస్ట్​ ఫైనల్​ చేసి అర్హుల జాబితాను వెల్లడించలేదు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పరిశీలించి, ఓకే చెప్పిన తర్వాతే లిస్ట్​ఫైనల్​ కానుంది. ఎమ్మెల్యేల ఆమోదం కోసం ఆఫీసర్లు ఎదురు చూస్తున్నారు. 

బీసీల్లోని 15 కుల, చేతి వృత్తులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మార్గదర్శకాలను కూడా రిలీజ్​చేసింది. జూన్​6 నుంచి 20 వరకు సంబంధిత వర్గాల వారి నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్హులైన 17,282 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను మున్సిపాలిటీలు, మండలాల వారీగా విభజించి, క్షేత్ర స్థాయి పరిశీలన కోసం బీసీ డెవలప్​మెంట్​ఆఫీస్​నుంచి పంపారు. టౌన్లలో మున్సిపల్ ​కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలు దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 15,319 మంది అర్హులు ఉన్నట్లు తేల్చారు. గడిచిన 5 ఏండ్లలో బీసీ వెల్ఫేర్​ ద్వారా ఏమైనా సంక్షేమ పథకాల లబ్ధి పొందారా? అనే వివరాల్ని పరిశీలించి అర్హుల లిస్ట్​ ఫైనల్​ చేశారు.   

నియోజకవర్గానికి 300 మందికి..

నియోజకవర్గానికి 50 మంది చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలని మొదట నిర్ణయించారు. ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో దీన్ని 300 మందికి పెంచారు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో బాన్సువాడ నియోజకవర్గంలోని సగం మండలాలు నిజామాబాద్​ జిల్లా పరిధిలోకి వస్తాయి. దీని దృష్ట్యా సగం మందిని అక్కడ సెలక్ట్ చేస్తారు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,050 మందికి రూ.లక్ష సాయం అందించనున్నారు.

లిస్ట్​ ఫైనల్​ చేస్తున్నాం..

ఆర్థిక సాయానికి సంబంధించిన ఫండ్స్​వచ్చాయి. లిస్ట్​ ఫైనల్​ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో చర్చించి సాయం పంపిణీ  చేసే తేదీలను ఖరారు చేసి లబ్ధిదారులకు అందజేస్తాం.

శ్రీనివాస్, జిల్లా బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​

అప్లికేషన్లు వేలల్లో..  ఇచ్చేది వందల్లో.. 

రూ.లక్ష ఆర్థిక సాయం కోసం వచ్చిన అప్లికేషన్లు వేలల్లో ఉండగా సాయం పొందే వారి సంఖ్య వందల్లో ఉంది. ఫస్ట్​నియోజకవర్గానికి 50 మందికే ఇవ్వాలని నిర్ణయించగా, మండలానికి 10 మందికి కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో వ్యతిరేకత వస్తుందని భావించి, ఆ సంఖ్యను 300కు పెంచారు. ఫస్ట్ విడతలో ఆర్థిక సాయం పొందే వారి లిస్టులో తాము సూచించిన వారి పేర్లు ఉండేలా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు. మండల స్థాయి బీఆర్ఎస్​ లీడర్లు ఎమ్మెల్యేలను కలిసి తమ అనుచరులకు ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇంకా లిస్టు ఫైనల్​ కాలేదు.