వ్యభిచారానికి ఒప్పుకోలేదని..

వ్యభిచారానికి ఒప్పుకోలేదని..
  • 19న రిసెప్షనిస్టు మిస్సింగ్.. డెడ్‌బాడీ వెలికితీత
  • రిసార్డ్‌ ఓనర్ సహా ముగ్గురు అరెస్టు

హరిద్వార్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో దారుణం జరిగింది. రిసార్టులో వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసెప్షనిస్టును చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ నేత కొడుకు కావడం వివాదాస్పదమైంది. సోమవారం రాత్రి యువతిని హత్య చేయగా.. శనివారం ఉదయం స్థానిక చీలా కెనాల్ నుంచి బాధితురాలి డెడ్‌బాడీని పోలీసులు బయటికి తీశారు. దీంతో మిస్సింగ్ కేసు, హత్య కేసుగా మారింది. ప్రధాన నిందితుడు, రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను పోలీసులు అరెస్టు చేసి.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఐజీ రేణుకా దేవి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బీజేపీ నుంచి వినోద్ ఆర్య బహిష్కరణ

పుల్కిత్ తండ్రి వినోద్ ఆర్య.. హరిద్వార్‌‌కు చెందిన బీజేపీ నేత. ఉత్తరాఖండ్ మాటి కాలా బోర్డ్ చైర్మన్‌గా గతంలో పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకున్నా.. రాష్ట్ర మంత్రి ర్యాంకులో ఉన్నారు. రిసెప్షనిస్ట్ హత్య నేపథ్యంలో వినోద్ ఆర్య, ఆయన కొడుకు పుల్కిత్ ఆర్యను బీజేపీ బహిష్కరించింది. ఓబీసీ కమిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నిందితుడి అన్న అంకిత్ ఆర్యను కూడా ప్రభుత్వం తొలగించింది. 

రిసార్ట్ కూల్చివేత

శుక్రవారం రాత్రి బుల్డోజర్‌‌తో రిసార్ట్ గోడలను పడగొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పౌరి జిల్లాలోని యమకేశ్వర్‌‌ బ్లాక్‌లో ఉన్న రిసార్టును అక్రమంగా నిర్మించారని, దాన్ని కూల్చివేశామని సీఎం ధామీ చెప్పారు. మరోవైపు రిసార్టు ఆవరణలో ఉన్న ఊరగాయల ఫ్యాక్టరీలో శనివారం మంటలు అంటుకున్నాయి. ఆధారాలను చెరిపేసేందుకు నిందితులే నిప్పు పెట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ఎమ్మెల్యే కారుపై స్థానికుల దాడి

యువతి హత్య కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ యమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిష్త్ వాహనంపై రిషికేశ్‌లో స్థానికులు దాడి చేశారు. చీలా కెనాల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే త్రుటిలో తప్పించుకున్నారు. మరోవైపు శుక్రవారం నిందితులను కోట్‌ద్వార్‌‌ నుంచి కోర్టుకు తరలిస్తుండగా.. స్థానికులు దాడి చేశారు. కారు విండో అద్దాలను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను చితకబాదారు.

వాట్సాప్ చాటింగ్ బయటికి..

బాధితురాలు తన ఫ్రెండ్‌తో చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌ షాట్లు బయటికి వచ్చాయి. ‘‘వారు నన్ను ప్రాస్టిట్యూట్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.. వీవీఐపీ గెస్టులకు రూ.10 వేలకు స్పెషల్ సర్వీసులు ఇవ్వాలని నన్ను బలవంతపెట్టారు” అని ఆమె వాపోయింది. రిసార్టు ఉద్యోగితో ఆమె ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు కూడా బయటికి వచ్చాయి. ఆమె ఏడుస్తుండటం అందులో వినిపించింది.

‘స్పెషల్ సర్వీసు’లకు ఒప్పుకోలేదని..

రిషికేశ్ దగ్గర్లోని వనంతర రిసార్టులో 19 ఏండ్ల యువతి పని చేస్తున్నది. అయితే ఈ నెల 19న తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. రిసార్టు ఓనర్ పుల్కిత్, అతడి సిబ్బంది హత్య చేసినట్లు తేల్చారు. రిసార్టుకు వచ్చే వీవీఐపీ అతిథులకు ‘స్పెషల్ సర్వీసులు’ ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతోనే యువతిని హత్య చేశారని, బాధితురాలు తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్ ద్వారా తెలిసిందని ఉత్తరాఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ చెప్పారు.

తర్వాత డెడ్‌బాడీని చీలా కెనాల్‌లో పడేసి, తమకేమీ తెలియనట్లు డ్రామాలు ఆడారని చెప్పారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నించారని, ఇంటరాగేషన్ తర్వాత తమ తప్పును ఒప్పుకున్నారని పౌరి ఏఎస్‌పీ శేఖర్ చంద్ర సుయాల్ చెప్పారు. బాధితురాలి డెడ్‌బాడీకి రిషికేశ్ ఎయిమ్స్‌లో పోస్ట్‌మార్టం చేశారు.