- ఇప్పటివరకు 3,21,604 దరఖాస్తులు
- ఫైన్ లేకుండా రేపటి వరకు అప్లయ్‌కి చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎప్ సెట్(ఎంసెట్)కు రికార్డు అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరిగింది. నిరుడు 3,20,683 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది గురువారం సాయంత్రానికి 3,21,604 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 2,33,517 అప్లికేషన్లు రాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 87,819, రెండింటికీ కలిపి మరో 268 మంది అప్లై చేసుకున్నారు.
ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు శనివారం వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 26న దరఖాస్తుల ప్రక్రియ మొదలు కాగా, ఈ నెల6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కోకన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. రూ.250 ఫైన్‌తో ఈ నెల 9 వరకు, రూ.500 ఫైన్‌తో 14 వరకు, రూ.2,500 ఫైన్‌తో 19 వరకు, రూ.5 వేల ఫైన్‌తో మే 1 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉందని చెప్పారు. మే 7 నుంచి 11 వరకు ఎప్ సెట్ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు.