హైదరాబాద్​లో గోదాములకు..రికార్డ్​ డిమాండ్

హైదరాబాద్​లో గోదాములకు..రికార్డ్​ డిమాండ్

హైదరాబాద్​, వెలుగు:  నగరంలో గోదాములకు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయి డిమాండ్​వచ్చింది. మొత్తం 5.1 మిలియన్​ చదరపు అడుగుల మేర జాగా అమ్ముడయింది. 2022తో పోలిస్తే డిమాండ్​ కొద్దిగా తగ్గింది. అప్పుడు 5.4 మిలియన్​ చదరపు అడుగుల జాగా అమ్ముడుపోయింది. 2022 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా ఏ సంవత్సరంతో పోల్చి చూసినా 2023 సంవత్సర డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇంటర్నేషనల్​ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్​ఫ్రాంక్​ ‘ఇండియా వేర్​హౌసింగ్​ మార్కెట్​‌‌‌‌–2023’ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్​ ప్రకారం.. గ్రోత్​ కొద్దిగా తగ్గడానికి థర్డ్​పార్టీ లాజిస్టిక్స్​(3పీఎల్​), ఈ–కామర్స్​ కంపెనీల కార్యకలాపాలు తాత్కాలికంగా నెమ్మదించడం  కారణం. అయితే ఆన్​లైన్​షాపింగ్, లాస్ట్​మైల్​ డెలివరీలకు రోజురోజుకూ డిమాండ్​ పెరుగుతూనే ఉన్నందున ఇక నుంచి గోదాములకు డిమాండ్​ మరింత అధికమవుతుంది. 

తయారీ రంగ కంపెనీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 18శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 39శాతానికి పెరిగాయి. త్రీపీఎల్ లావాదేవీలు 2022 ఆర్థిక సంవత్సరంలో 32శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 21శాతానికి తగ్గాయి. ఈ--–కామర్స్ లావాదేవీలు 28శాతం నుండి 17 శాతానికి పడిపోయాయి.  ఎఫ్​ఎంసీజీ, ఎఫ్​ఎంసీడీ లావాదేవీల వాటాల శాతం రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 5శాతం,  1శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.   రిటైల్ రంగం లావాదేవీలు 2022 ఆర్థిక సంవత్సరంలో 15శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 14శాతానికి తగ్గాయి. 

మేడ్చల్​ క్లస్టర్​ నంబర్ వన్​..

మేడ్చల్ క్లస్టర్‌‌లో వేర్‌‌హౌసింగ్‌‌కు డిమాండ్  కొనసాగుతోంది. దీని వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 60శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 61శాతంకి స్వల్పంగా పెరిగింది.  శంషాబాద్ క్లస్టర్  లావాదేవీలు కొద్దిగా పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 10శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 11శాతంకి ఎగిశాయి. పీఎల్​ఐ పథకం కింద అనుమతులు పొందిన అనేక కంపెనీలు హైదరాబాద్‌‌లో ఉన్నాయి. వీటిలో  మొబైల్ ఫోన్ తయారీ,  ఆటో రంగానికి చెందిన అనేక గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నందున తయారీ రంగం నుంచి వేర్‌‌హౌసింగ్​కు డిమాండ్ పెరుగుతోంది.  2023 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్​, మేడ్చల్​క్లస్టర్లలో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి.  అద్దెలు మాత్రం పెరగలేదు.