62.12లక్షల ఎకరాల్లో వరి నాట్లు

62.12లక్షల ఎకరాల్లో వరి నాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ఈయేడు వానాకాలంలో వరి సాగు ఆల్‌‌టైమ్‌‌ రికార్డులు బద్దలు కొట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా 62.12లక్షల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. పత్తి ఎక్కువ సాగు చేయాలని సర్కారు చెప్పినా.. తాజా వాతావరణ పరిస్థితుల్లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపారు. ఈఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పం టలు సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్‌‌గా పెట్టుకుంది.  బుధవారం నాటికి 1కోటి 32 లక్షల 84వేల ఎకరాల్లో పంటల సాగు నమోదైనట్లు వ్యవసాయశాఖ సర్కార్​కు నివేదిక అందించింది. వానాకాలం సీజన్‌‌లో సర్కార్​ టార్గెట్‌‌లో ఇప్పటి దాకా 92శాతం సాగైంది. 

రికార్డు సృష్టించిన వరి సాగు

జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, బావులు నిండిపోయాయి. దీంతో మిగతా పంటలకు ఎఫెక్ట్‌‌ కాగా, వరి నాట్లకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్నాయి. నిరుడు వానాకాలంలో 61.94లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌‌లో 45 లక్షల ఎకరాలు టార్గెట్​ పెట్టుకోగా.. ఇప్పటికే 62.12లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. సర్కారు ఇచ్చిన టార్గెట్‌‌కు మించి 138 శాతం వరి సాగు నమోదు కావడం గమనార్హం. పదేండ్లలో వరి సాగు దాదాపు రెండున్నర రెట్ల నుంచి మూడు రెట్ల దాకా పెరగడం గమనార్హం. 

టార్గెట్‌‌లో 92శాతం సాగైన పంటలు

వ్యవసాయశాఖ ఈ సీజన్‌‌లో 70 నుంచి 75లక్షల ఎకరాల్లో పత్తి  సాగు టార్గెట్‌‌ పెట్టగా ఇప్పటి దాకా 49.58 లక్షల ఎకరాల్లో సాగైంది. జూన్‌‌, జూలై పత్తి సాగుకు అనుకూలంగా ఉండగా, జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల దాకా  కురిసిన భారీ వర్షానికి పత్తిపంటపై ఎఫెక్ట్​ పడింది. దీంతో టార్గెట్‌‌లో 70శాతానికే పరిమితమైంది. ఈ వానాకాలం పంట సాగులో 75.73 లక్షల ఎకరాల్లో ఫుడ్‌‌ గ్రెయిన్స్‌‌ సాగైయ్యాయి. ఆయిల్‌‌ సీడ్స్‌‌ 4.49లక్షల ఎకరాలే సాగైనట్లు అగ్రి రిపోర్ట్‌‌ వెల్లడించింది. కంది 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్​ పెట్టుకోగా, ఇప్పటి దాకా 5.57 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌‌ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 4.29 లక్షల ఎకరాల్లో వేశారు. ఇది 110 శాతం సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు లక్ష్యం 8.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి దాకా 6.14లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసీజన్‌‌లో వరి, మొక్కజొన్న, మిరప పంటలు ఇప్పటికీ ఇంకా వేసుకోవడానికి అవకాశం ఉందని అగ్రికల్చర్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నరు.

వానాకాలం సాగులో నల్గొండ టాప్‌‌

ఈ సీజన్​లో 8 జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో వరి సాగు అత్యధికంగా ఉంది. 8 జిల్లాల్లో మెరుగ్గా సాగు నమోదైంది. అన్ని పంటలతో ఇప్పటి దాకా 11.14లక్షల ఎకరాలతో నల్గొండ టాప్‌‌లో ఉంది. తర్వాత సంగారెడ్డిలో 7.75లక్షల ఎకరాలు, వికారాబాద్‌‌లో 6లక్షల ఎకరాలు, సూర్యపేటలో 5.91లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌‌లో 5.61లక్షల ఎకరాలు, ఖమ్మంలో 5.56 లక్షల ఎకాలు, కామారెడ్డిలో 5.12 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్​లో  5.10లక్షల ఎకరాలు, నాగర్‌‌కర్నూల్‌‌లో 5.10లక్షల ఎకరాలు సాగయ్యాయి. తక్కువగా మేడ్చల్‌‌లో 20వేల ఎకరాలు, ములుగులో 1.27లక్షల ఎకరాలు, వనపర్తిలో 2.21లక్షల ఎకరాలు సాగైంది.