హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం

హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం
  • గురువారం 4,053 మెగావాట్లకు చేరిన డిమాండ్
  • గత ఏడాది మేలో అత్యధిక వినియోగం 3,756 మెగావాట్లు

హైదరాబాద్, వెలుగు: ఎండలు పెరుగుతుండడంతో కరెంట్​ వాడకం కూడా పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్​లో గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యుత్​సరఫరా వ్యవస్థపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ లోపాలను సరిచేయడంతో ఈ సీజన్​లో అంచనాలకు మించి విద్యుత్ వినియోగం నమోదైంది. రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​ పెరిగినా అధికారులు ఇబ్బందుల్లేకుండా కరెంటు సరఫరా చేశారు. హైదరాబాద్​లో గతేడాది మే19న 3,756 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఏప్రిల్ 18న 4,053 మెగావాట్ల డిమాండ్​ నమోదైంది. 2022 మార్చితో పోల్చుకుంటే 2023లో డిమాండ్ కేవలం 2.5% పెరుగుదల ఉండగా 2024లో అది 20.04 శాతానికి పెరిగింది. విద్యుత్ సరఫరాలో మెరుగైన మెయింటెనెన్స్ చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని సదరన్​ డిస్కమ్ ​సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

విద్యుత్​ శాఖకు భట్టి అభినందన

హైదరాబాద్​లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 4 వేల మెగావాట్లను అధిగమించడంతో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.  గురువారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్​తో గతంలో ఉన్న 3,756 మెగావాట్ల రికార్డు మైలురాయిని అధిగమించడం అభినందనీయమన్నారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ అధికారులు అంతరాయం లేకుండా  కరెంట్​ సరఫరా చేశారని చెప్పారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న  విద్యుత్ శాఖకు అభినందనలు తెలిపారు.