రైతులకు గుడ్ న్యూస్: పల్లి, మిర్చికి రికార్డు ధర..వరంగల్‌‌ మార్కెట్‌‌ లో రూ. 45 వేలు పలికిన ఎల్లో మిర్చి

రైతులకు గుడ్ న్యూస్: పల్లి, మిర్చికి రికార్డు ధర..వరంగల్‌‌ మార్కెట్‌‌ లో  రూ. 45 వేలు పలికిన ఎల్లో మిర్చి
  •     క్వింటాల్‌‌ పల్లికి బాదేపల్లిలో రూ. 9,865, వనపర్తిలో రూ. 9,784

వనపర్తి/జడ్చర్ల, వెలుగు : వేరుశనగకు గురువారం రికార్డు స్థాయి ధర దక్కింది. జడ్చర్ల, కల్వకుర్తి మార్కెట్‌‌లో రూ. 9,865 పలికిన క్వింటాల్‌‌ పల్లి.. వనపర్తి మార్కెట్‌‌లో రూ. 9,784 పలికింది. నెల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.764లు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కొల్లాపూర్‌‌ నియోజకవర్గంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన తిరుపతయ్య 150 బస్తాల వేరుశనగను వనపర్తి మార్కెట్‌‌కు తీసుకొచ్చారు. పల్లి క్వాలిటీ బాగుండడంతో క్వింటాల్‌‌కు గరిష్టంగా రూ.9,784 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. వనపర్తి మార్కెట్‌‌ ఏర్పడిన 47 ఏండ్లలో ఈ ధర పలకడం ఇదే మొదటిసారి అని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఎల్లో మిర్చికి రూ. 45 వేలు

కాశీబుగ్గ/ఖమ్మంటౌన్‌‌, వెలుగు : వరంగల్‌‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కు గురువారం వచ్చిన ఎల్లో రంగు మిర్చికి అత్యధిక ధర దక్కింది. ఓ రైతు ఎల్లో రంగు మిర్చిని మార్కెట్‌‌కు తీసుకురాగా.. క్వింటాల్‌‌కు అత్యధికంగా రూ. 45 వేలు పలికింది. 

అలాగే ఖమ్మం అగ్రికల్చర్‌‌ మార్కెట్‌‌లో తేజ మిర్చి క్వింటాల్‌‌ రూ. 21,150 పలికింది. ఈ ఏడాది  మిర్చికి డిమాండ్‌‌ పెరగడం.. దిగుబడి తగ్గడంతో ఎక్కువ ధర పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. తేజ రగం మిర్చి క్వింటాల్‌‌కు ఒక్క రోజు వ్యవధిలోనే రూ.1,150 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.