కరోనా నుంచి కోలుకుంటే ఇమ్యూనిటీ ఎంతకాలం?

కరోనా నుంచి కోలుకుంటే ఇమ్యూనిటీ ఎంతకాలం?
  • మరోసారి వైరస్ సోకదా?
  • ఇవి ప్రశ్నలుగానే మిగిలాయంటున్న సైంటిస్టులు
  • కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని వెల్లడి

పారిస్: కరోనా నుంచి కోలుకుంటే ఇమ్యూనిటీ వచ్చినట్లు కాదని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారికి ఎంతకాలం ఇమ్యూనిటీ ఉంటుందా అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు లేదన్నారు. ఇమ్యూనిటీ ఉందంటే వైరస్ ను తిప్పికొట్టే సామర్థ్యం మన శరీరంలో డెవలప్ అయినట్లేనని ఫ్రాన్స్ కు చెందిన ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ ఎరిక్ వివియర్ అన్నారు. మరోసారి అదే వైరస్ దాడి చేయకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ గుర్తుపెట్టుకునీ మరీ అడ్డుకుంటుందని చెప్పారు. మీజల్స్ లాంటి రోగాలకు లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తు చేశారు. ఆర్ఎన్ ఏ ఆధారిత వైరస్ లకు సరిపడా యాంటీబాడీస్ తయారీకి 3 వారాలు పడుతుందని, అవి కొన్ని నెలలపాటు మాత్రమే మనల్ని కాపాడుతాయన్నారు. కరోనా నుంచి రికవరీ అయిన వ్యక్తికి ఎంతకాలం ఇమ్యూనిటీ ఉంటుందన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకెల్ రియాన్ అన్నారు.

వైరస్ పూర్తిగా కనుమరగవదు

2002, 2003లో 800 మందిని బలి తీసుకున్న సార్స్ నుంచి కోలుకున్నవారికి మూడేళ్లపాటు ఇమ్యూనిటీ ఉందని లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్ జెనెటిక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బాలాక్స్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కోతికి మరోసారి వైరస్ ను ఎక్కిస్తే వ్యాధి సోకలేదని చైనాలో ఇటీవల ఓ స్టడీలో తేలింది. అయితే సౌత్ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మరోసారి పాజిటివ్ వచ్చింది. వ్యక్తి కోలుకున్న తర్వాత వైరస్ పూర్తిగా మాయమైపోదని, నిద్రాణంగా ఎలాంటి లక్షణాలు లేకుండా కొన్నివారాలపాటు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లా ఉంటుందని బాలాక్స్ చెప్పారు. చైనాలోని షాంఘైలో కరోనా నుంచి కోలుకున్న 175 మందిలో 10 నుంచి 15 రోజులపాటు ప్రొటెక్టివ్ యాంటిబాడీస్ ఉన్నట్లు ఓ స్టడీ వెల్లడించినట్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి ఆ వైరస్ నుంచి రక్షణ ఉంటుందా అన్నది ప్రశ్నగానే మిగిలిందని ఫ్రాన్స్ సైన్స్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్ జీన్ ఫ్రాంకోయి డెల్ఫ్రెస్సీ అన్నారు. వైరస్ కు వ్యతిరేకంగా తయారైన యాంటీబాడీస్ వల్ల కొన్నిసార్లు రోగం ముదిరే ప్రమాదం ఉందన్నారు. పేషెంట్ లో యాంటీబాడీస్ తయారైన తర్వాత సీరియస్ సింప్టమ్స్ కనిపించే అవకాశం కూడా ఉంటుందన్నారు.

కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం

కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని ఆస్ట్రేలియా పెర్త్ లోని కర్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్కీ క్లెమెంట్స్ అన్నారు. వివిధ దేశాల్లోని ల్యాబొరేటరీలు యాంటీబాడీ టెస్టులు చేస్తున్నాయని చెప్పారు. వైరస్ దాడిని తట్టుకోగలిగినవారికి ఇమ్యూనిటీ పాస్ పోర్టులు ఇచ్చి పనులకు వెళ్లేందుకు అనుమతించాలని జర్మనీలో కొందరు ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. అయితే ఇప్పుడే దీనిపై ఏం చెప్పలేమని యాలే స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ సాద్ ఒమర్ అన్నారు. యాంటీబాడి టెస్టులకు సంబంధించి కొన్ని నెలల్లో స్పష్టత వస్తుందన్నారు.