అక్రమాలు జరిగి రెండేళ్లయినా..రికవరీ చేయలే

అక్రమాలు జరిగి రెండేళ్లయినా..రికవరీ చేయలే
  •     దుబ్బాక పీఏసీఏస్​లో ఎరువులు అమ్మిన డబ్బులు స్వాహా
  •     ఫైనల్ ఆర్డర్ జారీకి అధికారుల కసరత్తు 

దుబ్బాక, వెలుగు : దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో ఎరువుల అమ్మకాల డబ్బుల రికవరీ పై అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులను సొసైటీలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారని తెలిసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా దీనిపై ఇంకా  విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిని వెనకేసుకొస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు.  దుబ్బాక పీఏసీఎస్ లో రెండేళ్ల  క్రితం రూ.72  లక్షల నిధుల గోల్ మాల్ జరిగినట్టు నిర్దారిస్తే

అప్పటి సీఈఓ రూ.34 లక్షల లెక్కలు చూపారు. మిగిలిన రూ.38 లక్షల లెక్క చూపకపోవడంతో18 శాతం వడ్డీతో అవి ఇప్పుడు రూ. 40 లక్షలకు చేరాయి. ఎరువుల అమ్మకాలకు సంబంధించిన డబ్బుతో పాటు సిబ్బంది పీఎఫ్​కు సంబంధించిన లక్షల రూపాయలు పక్కదారి పట్టిన విషయం ఆడిట్ లో బయటపడడంతో రెండేళ్ల క్రితం సీఈఓను సస్పెండ్ చేశారు. మూడు నెలల్లో విచారణ ముగించి అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి నుంచి డబ్బులు రికవరీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

అక్రమ బాగోతం ఇలా వెలుగులోకి..

సొసైటీ ఆధ్వర్యంలో  అమ్మిన ఎరువుల డబ్బులను సొంతానికి వాడుకుని ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్ డబ్బులను మార్క్ ఫెడ్ కు చెల్లిస్తూ అక్రమాలు బయటపడకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం అధికారుల ఆడిట్ సందర్భంగా  సొసైటీ ఖాతాలో డబ్బు నిల్వ లేకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయడంతో అక్రమ బాగోతం బయటపడింది. అప్పటి డిస్ట్రిక్ కో ఆపరేటివ్ అధికారి విచారణలో అక్రమాలు జరిగిన విషయం నిర్థారణ కావడంతో  దుబ్బాక పీఏసీఎస్ సీఈఓ లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేశారు. విచారణ ప్రారంభమైన తరువాత రూ.12 లక్షలు సొసైటీకి చెల్లించినా సర్ ఛార్జీలు కలుపుకుని ఇంకా రూ. 40 లక్షల రికవరీ చేయాల్సి ఉంది.

సజావుగా సాగని విచారణ

మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి అసలు వ్యక్తులను గుర్తించి డబ్బులు రికవరీ చేయాల్సి ఉన్నా నోటీసులు ఇచ్చి వదిలేశారు. అక్రమాలపై  అధికారులు సీఈఓపై చర్యలు తీసుకున్నా దీని వెనుకున్న ఉన్న వారిని గుర్తించడంలో   జాప్యం చేస్తున్నారనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల గోల్ మాల్ వ్యవహారం వెలుగులోకి రాగానే  స్టాట్యూటరీ ఎంక్వయిరీ నిర్వహించి నివేదిక వచ్చినా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటీ ప్రగతి లేదు. స్టాట్యూటరీ రిపోర్ట్ తర్వాత సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బుల  రికవరీ కోసం  సర్ ఛార్జీ  ఆర్డర్  జారీ చేసి జవాబుకు 21 రోజుల గడువును ఇస్తారు.

వీరు చెప్పే సమాధానం హేతుబద్ధంగా లేకుంటే ఆర్డర్ పాస్ చేసి రెవెన్యూ రికవరీ  యాక్ట్ ప్రకారం సొసైటీ ఈపీ ఫైల్ చేసి సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బుల రికవరీకి చర్యలు తీసుకోవాలి. ఇదంతా అవకతవకలు గుర్తించిన మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ కానీ ఇక్కడ మాత్రం  రెండేళ్లు  కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

త్వరలోనే ఫైనల్ ఆర్డర్ జారీ

దుబ్బాక పీఏసీఎస్ లో అవకతవకలకు సంబంధించి డబ్బుల రికవరీకి  త్వరలోనే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి ఇప్పటికీ రెండుసార్లు నోటీసును జారీ చేసినా స్పందన లేదు. త్వరలోనే ఫైనల్ ఆర్డర్ జారీ చేయనున్నాం.  తర్వాత సరైన సమాధానం ఇవ్వకుంటే ఈ విషయంలో సంబంధమున్న వారికి అటాచ్​మెంట్​ఆర్డర్స్ ఇచ్చి డబ్బుల రికవరీకి చర్యలు తీసుకుంటాం. 

కరుణ, ఇన్ చార్జి డిస్ట్రిక్ కో ఆపరేటీవ్ ఆఫీసర్