
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో రిక్రూట్‌మెంట్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కో ఆర్డినేటర్ (సెక్టోరల్ ఆఫీసర్లు) పోస్టుల భర్తీకి సంబంధించిన టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి ఆరు నెలలు దాటినా.. ఇప్పటికీ రిక్రూట్‌మెంట్ మాత్రం చేపట్టలేదు. దీంతో ఆ పోస్టుల కోసం పరీక్ష రాసిన హెడ్‌మాస్టర్లు, స్కూల్‌అసిస్టెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.
డిసెంబర్‌లో పరీక్షలు.. ఫిబ్రవరిలో రిజల్ట్స్
జిల్లాల్లో ఎస్ఎస్ఏ పరిధిలోని వివిధ విభాగాల పర్యవేక్షణకు జిల్లా కో ఆర్డినేటర్లు(సెక్టోరల్ ఆఫీసర్లు) కీలకం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో ముగ్గురు సెక్టోరల్ ఆఫీసర్లు పనిచేస్తుండగా, నాలుగు జిల్లాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ (ఏపీఓ)లు ఉన్నారు. వీరిలో చాలామంది హెడ్‌మాస్టర్లు, సీనియర్ టీచర్లు ఉండగా, కొందరు రిటైర్డ్ అధికారులు, ఎన్జీఓ ప్రతినిధులు కొనసాగుతున్నారు. సుమారు వంద మంది వరకు పనిచేస్తున్నారు. అయితే రాష్ర్టంలో ఒక్కో జిల్లాలో నాలుగు సెక్టోరల్ ఆఫీసర్ పోస్టులతోపాటు ఏఎస్ఓ, ఏపీఓ, సైన్స్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది అక్టోబర్ 29న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఎస్ఎస్ఏనోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నవంబర్1 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆయా పోస్టులకు మొత్తం1,641 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో జిల్లా ప్లానింగ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ పోస్టులకు 225, క్వాలిటీ, ఒకేషనల్ ఎడ్యుకేషనల్ కో ఆర్డినేటర్ పోస్టులకు 404, జెండర్, ఈక్విటీ కో ఆర్డినేటర్ పోస్టులకు 210, అసిస్టెంట్ సెక్టోరల్ ఆఫీసర్ పోస్టులకు 454, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో ఆర్డినేటర్ పోస్టులకు 287,జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ పోస్టులకు 101 మంది అప్లై చేశారు. వీరందరికీ గతేడాది డిసెంబర్ 22, 23 తేదీల్లో రాత పరీక్ష పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాల వారీగా రిజల్ట్‌తో పాటు మెరిట్ లిస్టులు పంపించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటి ప్రస్తావనే మరిచిపోయారు.
గడువు ముగిసినా విధుల్లోనే…
ప్రస్తుతం సెక్టోరల్ ఆఫీసర్లుగా పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులకు ముందుగా మూడేండ్ల పాటు ఫారిన్ సర్వీస్ కు అవకాశమిస్తారు. వారి పనితనం బాగుండి, వారు అక్కడే విధులు నిర్వహించాలనుకుని దరఖాస్తు చేసుకుంటే.. సర్వీస్‌ను మరో రెండేండ్లు పొడిగిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో చాలామంది నిర్ణీత గడువు ముగిసింది. అయినా కొనసాగింపు ఉత్తర్వులు లేకుండానే, వారంతా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే కొందరు పని సరిగ్గా చేయకపోవడంతో డీఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పని ఒత్తిడి భరించలేక విధులు నిర్వహించలేమని ఎస్ఎస్ఏ స్టేట్ఆఫీస్కు లెటర్లు కూడా పెట్టుకున్నారు. అయినా వారిని రీపాట్రియేషన్ చేయలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ, ఎస్ఎస్ఏ ఉన్నతాధికారులు స్పందించి పాత వారిని తొలగించి, మెరిట్ ప్రకారం కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.