
- నదీ పరివాహక ప్రాంతాల్లో ఏటా తుడిచిపెట్టుకుపోతున్న పంటలు
- నిండా మునుగుతున్న రైతులు
- రోజులపాటు జలదిగ్బంధంలోనే గ్రామాలు
- సమస్య తీర్చాలని వేడుకోలు
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు కాలాల పాటు ప్రవహించే జీవనదులు వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చి వేలాది ఎకరాల్లో పంటలను తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో ఏటా రైతులు తమ పంటలను నష్టపోతున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో కొన్ని రోజుల పాటు రాకపోకలు సైతం పూర్తిగా ఆగిపోయి జనజీవనం స్తంభించింది. సిర్పూర్ టీ మండలంలో ప్రారంభమయ్యే పెన్ గంగా నది, కౌటల మండలం తుమ్మిడిహెట్టి వద్ద వార్దాతో కలిసి ప్రాణహిత నదిగా మారుతుంది. బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల గుండా ప్రవహిస్తుంది.
ఆసిఫాబాద్, కెరమెరి, కాగజ్ నగర్, పెంచికల్ పేట్, దహెగాం, బెజ్జూర్ మండలాల మీదుగా ప్రవహించే పెద్ద వాగులు ప్రాణహితలోనే కలుస్తున్నాయి. ఈ నీటితోపాటు మహారాష్ట్రలోని పెన్ గంగా, వార్దా నదులపై నిర్మించిన బ్యారేజీల నుంచి నీటిని వదలడంతో సిర్పూర్ టీ, బెజ్జూర్ మండలాల్లోని నదీ పరివాహక ప్రాంతంల్లో నాలుగైదు కిలోమీటర్ల మేర వరద పారుతూ సాగు చేస్తున్న పంటలు నీట మునిగి పోతున్నాయి. భారీగా నష్టపోతున్న రైతన్నలు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో 4,653 ఎకరాల్లో నష్టం
ఏటా వానాకాలం వరదలతో పంటలు కొట్టుకుపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం వర్షాలు, వరదలతో 4,653 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. దహెగాం మండలంలో పెద్ద వాగు, ఎర్ర వాగు, ప్రాణహిత బ్యాక్ వాటర్ తో గెర్రె, గిరవెల్లి, ఖర్జి, దిగిడ, లోహ, రాంపూర్, మొట్లగూడ, రావులపల్లి గ్రామ శివారుల్లోని వేల ఎకరాల పత్తి పంట నీటిలో మునిగింది. నాలుగైదు రోజులు నీటిలోనే ఉండడంతో పంట మొత్తం పాడైపోయింది. రైతులు గంపెడాశలతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే నిండా మునుగుతున్నారు.
నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి
ఏటా పంటలు తుడిచిపెట్టుకుపోయి పెట్టిన పెట్టుబడి, కష్టం వృథా అయ్యి నష్టపోయతున్నామని రైతులు వేదన చెందుతున్నారు. దీంతో వరదలను కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. నదులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కరకట్ట కట్టాలని, సీజనల్పంటలకు కాకుండా పండ్ల మొక్కలు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం సహకారం అందించి సబ్సిడీతో దన్నుగా నిలవాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌పాలనలో ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన పంటలను సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కంకి దశకు వచ్చిన మక్కను బ్యాక్‌వాటర్ ముంచెత్తింది
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిర్పూర్ టి మండలం టోంకిని గ్రామానికి చెందిన రైతు మురళీ హివార్కర్. రెండు ఎకరాల్లో మొక్క జొన్న పంట వేయగా కంకి దశకు వచ్చింది. 15 రోజులైతే కంకులు తెంపి అమ్ముతానని ఆశగా ఉండగా వర్షాలతో బ్యాక్ వాటర్ పంటను ముంచెత్తింది. నాలుగు రోజుల పాటు నీటిలోనే పంట ఉండడంతో మొత్తం వాడిపోయింది. సుమారు రూ.50 వేల నష్టం జరిగింది. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.