కాట్రియాల రైస్​ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్

కాట్రియాల రైస్​ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్
  • నిల్వ చేసిన 544 బస్తాల పీడీఎస్ రైస్ స్వాధీనం
  • మిల్లు యజమానిపై కేసు నమోదు..

 రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలోని భవానీ రైస్​మిల్లుపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, సివిల్ సప్లై అధికారులు మూకుమ్మడి దాడులు జరిపారు. అందులో అక్రమంగా నిల్వ ఉంచి, రీసైక్లింగ్ చేసిన 544 బస్తాల(సుమారు250 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీ రైస్ మిల్లులో పీడీఎస్​బియ్యాన్ని రీసైక్లింగ్​చేస్తున్నారని సమాచారం అందడంతో మంగళవారం రాత్రి విజిలెన్స్ ఎస్పీ ద్రోణాచార్య, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ, డీఎస్ఓ బ్రహ్మరావ్, డిప్యూటీ తహసీల్దార్ సాధిక్​ టీమ్​ఆకస్మిక దాడి చేసింది.

అక్రమంగా నిల్వ ఉంచిన 544 బస్తాల పీడీఎస్​బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోదాముకు తరలించింది. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. సదరు రైస్ మిల్లుకు సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను ఇతర రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గడిచిన మూడు సీజన్ల స్టాక్ వివరాలు పరిశీలిస్తున్నామని, వ్యత్యాసం ఉంటే  కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.