
హుజూర్ నగర్, వెలుగు: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే ఊరుకునేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం ఆయన హుజూర్ నగర్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. రేషన్ డీలర్లు, లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టాయని, నాయకుల అండతో పౌల్ట్రీఫామ్‌లకు , బీర్ల తయారీ కంపెనీలకు తరలిపోయాయన్నారు.
ఇకపై రేషన్ బియ్యం దందా చేస్తున్న వ్యాపారులు, రీసైక్లింగ్‌కు పాల్పపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు రూ.3,300 కోట్లని, అది ఇప్పుడు రూ.56 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్‌పై వడ్డీ భారమే రూ. 3 వేల కోట్లు ఉందన్నారు. అందుకే కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు చెప్పారు.
గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి సేకరించిన రూ.22 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ఏ గ్యారంటీ లేకుండా మిల్లర్ల దగ్గర నిల్వ చేయడంపై సమీక్ష చేస్తామన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు వెంటనే తిరిగి ఇవ్వకుండా మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారని, కార్పొరేషన్ , మిల్లర్ల మధ్య ఉన్న ధాన్యం లెక్కల తేడాలపై విచారణ జరుపుతామన్నారు. డీలర్ల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.