
- ఎడ తెగని వానలతో దెబ్బతిన్న పంట
- పెరిగిన పెట్టుబడులు, కూలీల ఖర్చు
- నష్టపోతున్న కమర్షియల్ పత్తి రైతులు
గద్వాల, వెలుగు: ఎడతెగని వానలు, ఎర్ర తెగుళ్లు కమర్షియల్ పత్తి పంట రైతులకు నిండా ముంచాయి. పత్తి విత్తనాలు వేసినప్పటి నుంచే వానలు పడుతుండడంతో పంట సరిగా ఎదగలేదు. దానికి తోడు ఎర్ర తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ఎఫెక్ట్ పడింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దిగుబడి సగానికి సగం తగ్గిం దని.. పెట్టుబడి ఖర్చులు కూడా నిరుటికన్నా పెరిగాయని కమర్షియల్ పత్తి రైతులు వాపోతున్నారు. ఎకరానికి 30 నుంచి 40 వేల వరకు నష్టపోవాల్సివస్తోందని ఆవేదన చెందుతున్నారు.
లక్ష 20 వేల ఎకరాల్లో సాగు
గద్వాల జిల్లాలో ఈసారి లక్షా 20వేల ఎకరాల్లో కమర్షియల్ పత్తి సాగు చేశారు. విత్తనాలతో పాటు సాగు ఖర్చులు, కూలీలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల కోసం ఒక్కో ఎకరానికి రూ. 40 వేల వరకు ఖర్చయ్యింది. కౌలు రైతులు ఎకరానికి రూ. 70వేల వరకు ఖర్చు పెట్టారు.
వానలు, ఎర్ర తెగుళ్ళ ఎఫెక్ట్
జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయింది. వరుస వానలు, ముసురు పంటల మీద ప్రభావం చూపింది. అధిక వర్షాల వల్ల పత్తి చేలలో నీరు నిలిచి పంట ఎదగకుండా గిడసబారింది. దీనికి తోడు ఎర్ర తెగుళ్లతో పంట దెబ్బతిన్నది. నిరుడు పత్తి లాగేందుకు కూలీలకు కేజీకి రూ. 8 నుంచి 10 ఇస్తే ఈసారి రూ. 10 నుంచి 15 వరకు డిమాండ్ చేస్తున్నారు.
కలుపు కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. గత ఏడాది ఎకరానికి యావరేజ్ గా 12 క్వింటాల నుంచి 15 క్వింటాళ్ల పత్తి పండగా.. ఈసారి కేవలం 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తున్నదని రైతులు చెప్తున్నారు. ఎర్ర తెగుళ్ల కారణంగా పత్తి క్వాలిటీగా ఉండడంలేదంటున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి కాయ సరిగా పగలక తెల్లటి పత్తి రాలేదని, ఫలితంగా రేటు కూడా తగ్గవచ్చునని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట పీకేశారు
చేలల్లో నీరు నిలవడం, ఎర్ర తెగుళ్ల కారణంగా పంట సరిగా ఎదగలేదు. దీంతో కొందరు పత్తి పంటను పీకేసుకుని మొక్కజొన్న తదితర పంటలు వేశారు. పత్తి సాగు మీద భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు కొంతవరకైనా నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇతర పంటలు సాగు చేసినట్టు చెప్తున్నారు.
ఎర్ర తెగుళ్లు ఉన్నమాట వాస్తవమే
ఎర్ర తెగుళ్లతో కమర్షియల్ పత్తి పంటకు నష్టం వస్తుందన్నమాట వాస్తవమే. వానలు ఎక్కువ పడడం వల్ల పొలాల్లో నీరు నిలిచి పంటకు నష్టం కలిగింది. మెట్ట పొలాల్లో నష్టం జరగలేదు. వరి సాగుచేసే పొలాల్లో పత్తి వేసుకున్న రైతులకు మాత్రం నష్టం జరిగింది.
-సక్రియా నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, గద్వాల