ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నర్సాపూర్, వెలుగు : లీడర్ల ప్రయోజనం కోసం రీజినల్​ రింగ్ రోడ్​అలైన్​మెంట్ మార్చారని నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 
దీనికి స్పందించిన ఆయన రెడ్డిపల్లిలో రింగ్ రోడ్డు నిర్మించే ప్రాంతంలోని చెరువు, ఆయకట్టు కింద ఉన్న పంట భూములను పరిశీలించారు. మొదటి అలైన్​మెంట్​ ప్రకారం నిర్మాణం చేపడితే పంట పొలాలు పోకుండా శిఖం భూమి పోతుందని రైతులు తెలిపారు. అలైన్​మెంట్ మార్పుతోచిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీడర్లు, భూస్వాముల భూములు పోకుండా అలైన్​మెంట్ మార్చారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.  ఎమ్మెల్యే స్పందిస్తూ ఆర్డీవోతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. భూములు పోతున్న రైతులకు మార్కెట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ ఎమ్మెల్యేను కోరారు.  

వీఆర్​ఏల డిమాండ్లు నెరవేర్చాలి

మెదక్ (శివ్వంపేట), వెలుగు: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి డిమాండ్ చేశారు. శివ్వంపేట తహసీల్దార్ ​ఆఫీస్​ ముందు దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు బుధవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీఆర్ఏలు లేకుంటే గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావన్నారు. చాలా రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్​గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రవి గౌడ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల ఉపాధ్యక్షుడు వినోద్, నాయకులు ఉన్నారు. 

చంద్రఘంట రూపంలో వనదుర్గమాత

పాపన్నపేట, వెలుగు :  మెదక్ ​జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం చంద్రఘంట దేవి రూపంలో వనదుర్గ భవానీ మాత భక్తులకు దర్శమిచ్చారు. గోకుల్​ షెడ్డులో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పాలక మండలి చైర్మన్​ బాలాగౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్​ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

పదవులన్నీ అంబేద్కర్​ పుణ్యమే

దుబ్బాక, వెలుగు : దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పదవులన్నీ అంబేద్కర్ ​పుణ్యమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలను పక్కన పెట్టి,  దేశంలో జన్మించి 18 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కును భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన మహానీయుడు అంబేద్కర్​ అన్నారు. బుధవారం దౌల్తాబాద్​ మండలం ఉప్పరిపల్లి గ్రామంలో అంబేద్కర్​ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్​ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి, ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్​ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆ రాజ్యాంగమే రాయకపోతే ఇంతపెద్ద దేశంలో ప్రజాస్వామ్యం ఉండేదికాదన్నారు.  ప్రతి గ్రామంలో అంబేద్కర్​ విగ్రహం ఉండాలన్నదే తన అభిమతమని, లేని విలేజ్​లలో విగ్రహాన్ని ఇప్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్​, సర్పంచ్​ కలాలి చిత్తారి గౌడ్​, వైస్​ఎంపీపీ అల్లి శేఖర్​రెడ్డి, మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ నాగరాజు గౌడ్, మాజీ సర్పంచ్​ ఆది వేణు, అంబేద్కర్​ యువజన సంఘం అధ్యక్షుడు ఎం. స్వామి, బీజేపీ నాయకులు అల్లి రామస్వామి గౌడ్, కిషన్​, స్వామి, కనకరాజు పాల్గొన్నారు. 

మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

మెదక్​ టౌన్, వెలుగు: తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని మెదక్ ​అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అన్నారు. బుధవారం జిల్లా  మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో నాన బియ్యం బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. 

బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ సెలబ్రేషన్ లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మార్వో దశరథ్ సింగ్ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతిని తెలియజేసేలా ప్రతీ పండుగను కాలేజీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం అభినందనీయమన్నారు. 

వచ్చే 20 ఏండ్లకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ 

నారాయణ్ ఖేడ్, వెలుగు : పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఖేడ్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని జిల్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంబిక అన్నారు.  బుధవారం ఖేడ్ మున్సిపల్ ఆఫీస్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏండ్లకు టౌన్ అభివృద్ధిని అంచనా వేసి దానికనుగుణంగా ప్లానింగ్ రూపొందిస్తామన్నారు. ఇందుకుసంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్, ఇతరశాఖలు తమకు సంబంధించిన డేటాను ఏర్పాటు చేసుకుని త్వరితగతిన సమర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ్ సింగ్, కమిషనర్ మల్లారెడ్డి, ఆయా వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఆసరా పెన్షన్లు పంపిణీ..

ఖేడ్​లోని షెట్కార్ ఫంక్షన్ హాల్ కొత్త ఆసరా పెన్షనలను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు.

రైతుబంధు పేరిట సబ్సిడీలకు ఎగనామం

సిద్దిపేట, వెలుగు :  రైతుబంధు ఇస్తున్నామని చెబుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలకు ఎగనామం  పెడుతున్నదని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆయన 20 ఏండ్ల పాలనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  సిద్దిపేట వయోలా గార్డెన్ లో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఏపీ, యూరియా తో పాటు ఇతర ఎరువుల ధరలు పెరిగినా రైతుల పై భారం పడకుండా కేంద్రం సబ్సిడీలు ఇస్తుందన్నారు.  సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు చేసిందేమీలేదన్నారు. కేంద్రం నిధులతో పనులు చేపడుతూ వాటిని తమ గొప్పలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతకుముందు మోడీ పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో  నాయకులు రాంచంద్రారెడ్డి, జే.సురేందర్ రెడ్డి, రాంరెడ్డి, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

ఘనంగా భగత్​ సింగ్​ జయంతి

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్​ పట్టణంలో భగత్ ​సింగ్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్​దళ్​ ఆధ్వర్యంలో మెదక్​లోని మిలటరీ కాలనీలో, హవేలీఘనపూర్​ చౌరస్తాలో భగత్ ​సింగ్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్​లో వీహెచ్​పీ మెదక్​  జిల్లా వైస్​ ప్రెసిడెంట్​మల్కాజి సత్యనారాయణ, మెదక్​ టౌన్​ ప్రెసిడెంట్​ ఆరెళ్ల అరవింద్,  మెదక్ విభాగ్ ప్రచార  ప్రముఖ్ సునీల్,  సత్సంగ్ సహ ప్రముఖ్ గణేశ్ పాల్గొన్నారు. 

కార్మికుల సమస్యలు పార్లమెంటులో చర్చించండి

సిద్దిపేట, వెలుగు :  రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ సభ్యుడు  దరిపల్లి చంద్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని  కోరారు. బుధవారం హైదరాబాద్​లో ఆయనను కలసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.  రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సెల్మెడ రాములు సారంగపాణి మల్లేశం, నరేశ్,  శివకుమార్, భిక్షపతి  పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసులను త్వరగా దర్యాప్తు చేయాలి 

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అట్రాసిటీ కేసుల్లో పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి చార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు. భూములకు సంబంధించిన కేసులపై రెవెన్యూ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 64 అట్రాసిటీ కేసులు రాగా, వీటిలో 16 కేసుల్లో బాధితులకు రూ.19 లక్షల పరిహారం అందినట్లు తెలిపారు. ప్రతినెలా మండలానికి ఒక గ్రామంలో పౌర హక్కుల దినం నిర్వహించాలని కమిటీ సభ్యులు కోరారు. ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న పరిహారం వృథా కాకుండా సద్వినియోగం అయ్యేలా సభ్యులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్ వో రాధికా రమణి, ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్​చార్జి అధికారి జగదీశ్, సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డీఎస్పీలు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సీఎస్ఆర్ నిధుల పర్యవేక్షణకు కమిటీ..

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలో పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడం కనీస బాధ్యత అని కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీస్​లో సంబంధిత అధికారులతో కంపెనీస్ యాక్ట్, సీఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణపై ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు. నిధులను రాబట్టేందుకు, పర్యవేక్షణ కోసం 19 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిశ్రమలు తమ లాభాల్లో రెండు శాతం సీఎస్ఆర్ కింద జమ చేయాల్సి ఉంటుందన్నారు. అధికారుల బృందం ఆయా క్లస్టర్ లో ఉన్న అన్ని పరిశ్రమలను 15 రోజుల లోగా తనిఖీ చేసి అన్ని వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

12 ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.3 లక్షల ఫైన్

గజ్వేల్, వెలుగు : గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ శ్రీధర్​ఆధ్వర్యంలో హెల్త్​ ఆఫీసర్స్​ టీమ్​ బుధవారం తనిఖీలు నిర్వహించింది. జగదేవ్​పూర్, గజ్వేల్​లోని 15 ఆస్పత్రులను ఆఫీసర్లు పరిశీలించారు. ఇందులో రూల్స్​ పాటించని 12 ఆసుపత్రులకు రూ.3 లక్షల ఫైన్​ విధించారు. మరో మూడు ఆస్పత్రులకు షోకాజ్​ నోటీసులు అందజేశారు. 

బతుకమ్మ చీరల పంపిణీ

ఉమ్మడి మెదక్ ​జిల్లాలో బుధవారం పలుచోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మెదక్​ జిల్లా హవేలీఘనపూర్​ మండలం కూచన్​పల్లిలో బుధశారం  సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, మద్దూరు, కొమురవెల్లిలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చేర్యాల మున్సిపల్​ కేంద్రంలోని అన్ని వార్డులతో పాటుగా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. మహిళలను గౌరవించేందుకే పసుపుకుంకుమగా చీరలను అందజేస్తున్నారని తెలిపారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

- వెలుగు నెట్​వర్క్​ 

కాలనీకి ఫ్రీ వాటర్​ ఇవ్వాలి

రామచంద్రాపురం, వెలుగు : భారతీనగర్​ జీహెచ్​ఎంసీ డివిజన్​ పరిధిలోని మ్యాక్ సొసైటీ కాలనీకి ఉచిత తాగునీటిని అందించాలని వాటర్​ వర్క్స్​ ఎండీ దానకిశోర్​ను ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కోరారు. బుధవారం ఎండీ దానకిశోర్​తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కొన్ని సాంకేతిక కారణాలతో కాలనీలోని 438 గృహాలకు ప్రతినెలా నల్లా బిల్లు వస్తోందని, జీహెచ్​ఎంసీ లిమిట్​లో ఉన్నందున ఫ్రీ వాటర్ స్కీమ్​ అమలు చేయాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి ఎండీ దానకిశోర్​ స్పందిస్తూ త్వరలోనే స్థానిక అధికారుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో జలమండలి జీఎం రాజశేఖర్ పాల్గొన్నారు. 

మహిళల అభివృద్ధికి అడ్డంకిగా కట్టుబాట్లు

రామచంద్రాపురం, వెలుగు :  నాన్​ జెండర్​హెల్త్ ​కేర్​ను ప్రోత్సహించాలని పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ స్కూల్​ ఆఫ్​ హ్యుమానిటీస్​ అండ్ సోషల్​ సైన్సెస్​ అసిస్టెంట్ ప్రొఫెసర్ ​దుర్గేశ్ ​నందిని అన్నారు. గురువారం క్యాంపస్​లో ‘మహిళల మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై నిర్వహించిన వర్క్​షాప్​లో ఆమె మాట్లాడారు. రాజకీయ, నిర్మాణ, సాంస్కృతిక, ఆరోగ్య సంరక్షణ స్థాయిలలో నాన్​ జెండర్ పాలసీలు అమలు కావాలని ఆకాంక్షించారు. కొన్ని కట్టుబాట్లు మహిళల అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయని, ప్రతి పది మందిలో ఏడుగురు మహిళలు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని తెలిపారు. అనంతరం స్టూడెంట్స్​ లోని పలు సందేహాలను ఆమె క్లియర్​ చేశారు. 

పెండింగ్ చలాన్​ కోసం ఆర్టీసీ బస్సు ఆపిన్రు.. 

మెదక్ (నిజాంపేట), వెలుగు: పెండింగ్​ చలాన్ల క్లియరెన్స్​ కోసం పోలీసులు ప్రైవేట్​ వెహికల్స్​నే కాదు.. ఆర్టీసీ బస్సులనూ ఆపుతున్నారు. బుధవారం నిజాంపేట పోలీస్​ స్టేషన్​ వద్ద వెహికల్స్ ను ​చెక్​ ​చేస్తున్న పోలీసులు సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తున్న బస్సును ఆపారు. ఆ బస్సుపై రాంగ్​ పార్కింగ్​కు సంబంధించి రూ.535 చలాన్ ​పెండింగ్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పెండింగ్ చలాన్​ క్లియర్ చేసుకోవాలని డ్రైవర్​కు సూచించారు. 

హుస్నాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

కోహెడ(హుస్నాబాద్​),  వెలుగు: హుస్నాబాద్​నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఎమ్మెల్యే సతీశ్​కుమార్​కు సవాల్ విసిరారు. బుధవారం హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ అభివృద్ధితో పోల్చుకుంటే హుస్నాబాద్ లో అభివృద్ధి శూన్యమని, అలాంటిది హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సతీశ్​విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విషయమై మాట్లాడిన ఈటల రాజేందర్ ను విమర్శించడం మానుకొని, ఇటీవల రెసిడెన్షియల్ హాస్టల్​లో మృతి చెందిన శరణ్య అనే బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని, బాలిక మృతికి కారణాలపై నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట పనుల్లో టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయపాల్​రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.