కార్లు వద్దు.. జర్మనీలో తగ్గిన డిమాండ్

కార్లు వద్దు.. జర్మనీలో తగ్గిన డిమాండ్

జర్మనీ.. అనగానే బెంజ్‌‌, ఆడీ, ఫోక్స్‌‌వాగన్‌‌, బీఎండబ్ల్యూ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ  గుర్తొస్తాయి. అంతెందుకు జర్మనీ పారిశ్రామిక రంగంలో 20 శాతం వాటా ఆటోమొబైల్‌‌ రంగానిదే. అక్కడోళ్లకు కార్లంటే పడిచచ్చిపోతారు. అలాంటిది ఇప్పుడు వాళ్లే ‘వద్దురా బాబూ కార్లు’ అంటున్నారు. వాటిని వాడబోమని చెప్పేస్తున్నారు. కారుకు బదులు కొత్త ఐఫోన్‌‌ గిఫ్టివ్వమని అక్కడి యువత కోరుతున్నారు. ఇంతలో అంత మార్పు ఎందుకొచ్చిదంటారు? కార్లు వద్దని వాళ్లు ఎట్లా ప్రయాణం చేద్దామనుకుంటున్నారు?

కార్ల రంగానికి షాక్‌‌……

జర్మనీ ఆటోమొబైల్‌‌ ఇండస్ట్రీలో 8 లక్షల 20 వేల మంది పని చేస్తున్నారు. 2017లో 55 లక్షల ప్యాసింజర్‌‌ కార్లను ఆ దేశం తయారు చేసింది. జర్మనీ ఇండస్ట్రియల్‌‌ ఔట్‌‌పుట్‌‌లో 20 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. కానీ ఇప్పుడు ఆ రంగానికే పెద్ద దెబ్బ పడింది. క్లైమేట్‌‌ యాక్టివిజం వల్ల కార్లకు డిమాండ్‌‌ పడిపోయింది. దేశంలోని 48 శాతం మంది పర్యావరణ మార్పులు ఇప్పడో పెద్ద సమస్యని ఆందోళన చెందుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశాన్ని కార్బన్‌‌ రహితంగా  మార్చాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.

దెబ్బకు జీడీపీ తగ్గింది….

గతేడాది జర్మనీ జీడీపీ తగ్గింది. కార్ల అమ్మకాలు పడిపోవడమే దానికి కారణమని వెల్లడైంది. కాబట్టి కార్ల తయారీ కంపెనీలు వాళ్ల మోడళ్లను మార్చుకునే సమయం వచ్చిందని ఓ ఆటో అనలిస్ట్‌‌ అన్నారు. ప్రొడక్షన్‌‌ పడిపోవడంతో బెంజ్‌‌, ఫోక్స్‌‌వ్యాగన్‌‌, ఆడీ కంపెనీలు కూడా కార్బన్‌‌ న్యూట్రల్‌‌గా మారాలని నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రిక్‌‌ వైపు అడుగు పెడతామని చెప్పాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు జర్మనీ సర్కారు కూడా చర్యలు తీసుకుంటోంది. అక్కడ 1990 నాడున్న కార్బన్‌‌లో 40 శాతం వచ్చే ఏడాది వరకు తగ్గించాలని నిర్ణయించుకుంది. అక్కడ కాలుష్యానికి ముఖ్య కారణం కరెంటు ఉత్పత్తి. దీంతో 2038 నాటికి కోల్‌‌ ఎనర్జీ ప్లాంట్లను మూసేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుంది. తర్వాతి పెద్ద సమస్య రవాణా. దీన్నుంచి బయట పడటం ఎలారా అని ఆలోచిస్తుంటే అక్కడి ప్రజలే సొంతంగా కార్లు వాడటం తగ్గించేస్తామని ముందుకొచ్చారు.