అమెరికా బ్యాంకుల నిర్ణయాలు ఇండియా ఐటీ కంపెనీల ఆదాయాలను దెబ్బకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి బ్యాంకులు కాస్ట్ కటింగ్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఇండియా ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఐటీ మార్కెట్‌కు 227 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా వీటిలో 30 శాతం వాటా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) కంపెనీల నుంచే ఉంది. ఇవి ఇప్పుడు ఐటీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో అమెరికా బ్యాంకులు అలర్టయ్యాయి. ఖర్చులకు కత్తెరేస్తున్నాయి. క్రెడిట్లాస్ ప్రొవిజన్లను పెంచుతున్నాయి. ఇది వరకే మార్జిన్లు తగ్గి ఇబ్బందిపడుతున్న ఇండియా ఐటీ కంపెనీలకు ఈ పరిస్థితి ఇబ్బందికరమే! బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) క్లయింట్లు భారతీయ ఐటీ మార్కెట్‌కు ఎంతో కీలకం. అమెరికాలో లెండింగ్ లోన్ల తగ్గుదల కూడా భారతీయ సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారులకు నష్టాలు తేవొచ్చని ఎనలిస్టులు తెలిపారు. "పెద్ద యూఎస్ బ్యాంకులు తమ ఆదాయం- దాదాపు 40శాతం (మొత్తం) వరకు ఐటీ సేవల కోసం ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇవి 'క్రెడిట్ లాస్' ప్రొవిజన్లను పెంచుతున్నాయి. ఇది వరకటి క్వార్టర్లలో మాదిరిగా పరిస్థితి లేదు. బ్యాంకులు పొదుపుపై శ్రద్ధ చూపుతున్నాయి " అని బ్రోకరేజ్ హౌస్ ఎలారా క్యాపిటల్ తెలిపింది. వెల్స్ ఫార్గో, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గన్ స్టాన్లీ వంటి బ్యాంకులు నష్టాలు పెరగకుండా చూడటానికి ఖర్చులను తగ్గించుకుంటున్నాయని వివరించింది. పెద్ద యూఎస్ బ్యాంకుల ఇటీవలి అభిప్రాయాలను (కామెంటరీ) కూడా ఇది ప్రత్యేకంగా ప్రస్తావించింది.
సత్తాను పెంచుకోవడంపై ఫోకస్
వెల్స్ ఫార్గో 2023 క్యాలెండర్ సంవత్సరం బడ్జెట్.. ఆపరేషనల్ సామర్థ్యం, ఖర్చు తగ్గింపులపై దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. మరో యూఎస్ బ్యాంకు గోల్డ్‌మన్ శాక్స్.. కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా బ్యాంకులు టెక్ ఖర్చులకు సంబంధించిన ఖర్చులను తగ్గించడం ఇండియా ఐటీకి నష్టదాయకమేనని రుచి ముఖిజా, వైభవ్ చెచాని, సీమా నాయక్ అనే ఎనలిస్టులు ఇటీవలి రీసెర్చ్ నోట్‌లో తెలిపారు. "ఇది వరకే బ్యాంకులు ఖర్చులను తగ్గించుకున్నాయి. ఇన్వెస్ట్మెంట్లపై నిర్ణయాలను పక్కనబెడుతున్నాయి. వచ్చే సంవత్సరం వరకు ఇలాగే ఉండొచ్చు. ఈ పరిస్థితులు ఇండియా మార్కెట్‌కు ఇబ్బందే” అని రీసెర్చ్ ఫర్మ్ హెచ్ఎఫ్ఎస్ చీఫ్ ఎనలిస్ట్ ఫిల్ ఫెర్ష్ట్ చెప్పారు. భారతీయ ఐటీ కంపెనీలు బ్యాంకులకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కోర్-బ్యాంకింగ్ ప్రొడక్టులు, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ సేవలను అందిస్తాయి. లోన్ ఒరిజినేషన్‌తో సహా మార్జిగేజ్ సాఫ్ట్‌వేర్ సేవలను కూడా అందిస్తాయి.
తనఖా లోన్లు తగ్గుతున్నయ్
బీఎఫ్ఎస్ఐ వ్యాపారంలో తనఖా లోన్లు ఎంతో కీలకం. వడ్డీరేట్లు వీటికి ఎంతో ముఖ్యం. ఈ సంవత్సరం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పలుసార్లు మార్చింది. దీంతో యునైటెడ్ స్టేట్స్‌లో మొత్తం తనఖా లోన్లు జులై నాటికి (సంవత్సరానికి) 53.5 శాతం తగ్గాయి. ఈ సెగ్మెంట్‌కు సేవలు అందించే భారతదేశ ఐటీ కంపెనీలపై ఇది తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. అన్ని టైర్–I టెక్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తనఖా లోన్ సేవలను అందిస్తాయి. ఎలారా క్యాపిటల్ అంచనాల ప్రకారం, టైర్ 1 కంపెనీల జాబితాలో విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తనఖా లోన్ సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తున్నాయి. టైర్ 2 కంపెనీల్లో ఎంఫాసిస్ ఈ సెగ్మెంట్‌పై పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడటానికి ఈ కంపెనీ ముందుకు రావడం లేదు. “2008–-09 (గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్) మాదిరిగా, తనఖా లోన్లు తగ్గడం వల్ల భారతీయ సర్వీస్ ప్రొవైడర్లపై ఎఫెక్ట్ఉంటుంది. ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. సమీప కాలానికి లోన్ల సంఖ్య తగ్గుతుంది" అని హెచ్ఎఫ్ఎస్కు చెందిన ఫెర్ష్ట్ చెప్పారు.
