గొర్రెల‌ స్కీమ్​ డీడీ డబ్బులు వాపస్‌

గొర్రెల‌ స్కీమ్​ డీడీ డబ్బులు వాపస్‌
  •     గొల్లకురుమల నుంచి విత్‌డ్రా అప్లికేషన్లు
  •     వెటర్నరీ డాక్టర్లకు కలెక్టర్ల ఆదేశాలు
  •     రెండు వారాల్లో డబ్బులు ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గొర్రెల యూనిట్ల కోసం కట్టిన డబ్బులను గొల్లకురుమలకు వాపస్ ఇచ్చేందుకు చర్యలు మొదలయ్యాయి. డబ్బులు కట్టి గొర్రెల యూనిట్ రాని వారి నుంచి డీడీ విత్‌‌ డ్రా కోసం అప్లికేషన్లు తీసుకోవాలని వెటర్నరీ డాక్టర్లను కలెక్టర్లు ఆదేశించించారు. ఈ మేరకు డబ్బులు వాపస్ తీసుకోవాలనుకుంటున్న గొల్లకురుమలు దరఖాస్తులు చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్లు, గొల్లకురుమల సంఘాలకు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దరఖాస్తులు తీసుకుని, కలెక్టర్ ఆఫీసులకు పంపించారు. విత్‌‌డ్రా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 2 వారాల్లోపు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పుడు డీడీలు వెనక్కి తీసుకుంటే, మళ్లీ గొర్రెలు వస్తయో లేదోనన్న ఆందోళన గొల్లకురుమల్లో వ్యక్తమవుతున్నది. దీనిపై వెటర్నరీ డాక్టర్లను ప్రశ్నించగా.. ప్రభుత్వం గొర్రెల పంపిణీని మళ్లీ ప్రారంభిస్తే, డీడీలు వెనక్కి తీసుకున్నవాళ్లకు కూడా గొర్రెలు వస్తాయని చెబుతున్నారు. అయితే వారు మరోసారి డీడీలు తీయాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గొర్రెల పంపిణీ ప్రారంభమవడానికి చాలా సమయం పడుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గొర్రెల పంపిణీలో జరిగిన భారీ అవినీతిని, కాగ్ ఇటీవలే ఆధారాలతో సహా బయటపెట్టింది.

వెయ్యి కోట్లకుపైగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. గొర్రెల పంపిణీ స్కీమ్‌‌పై కొత్త సర్కార్ స్పష్టత ఇవ్వకపోవడంతో, అప్పులు చేసి డీడీలు కట్టిన గొల్లకురుమలు ఆందోళన చెంది ప్రజావాణిలో దరఖాస్తులు చేశారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. గొల్లకురుమలు అప్పులు చేసి, తమ వాటా కింద రూ.43,750 చొప్పున డీడీలు కట్టారని, వారిపై వడ్డీల భారం పెరుగుతున్నదని చెప్పారు. గొర్లు ఇవ్వలేని పక్షంలో, వడ్డీతో సహా వారికి డబ్బులు చెల్లించాలన్నారు. 

సాగదీసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌

గతేడాది జూన్‌‌లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నట్టు అప్పటి బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ ప్రకటించింది. గొర్రెలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది డీడీలు కట్టారు. అప్పులు తీసుకొచ్చి మరీ, లబ్ధిదారు వాటా కింద రూ.43,750 చొప్పున బ్యాంకుల్లో డీడీలు తీశారు. ఆగస్టులో ప్రతి ఊరి నుంచి పది, పదిహేను మందికి ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేసింది.

ఇదే సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అనౌన్స్‌‌మెంట్ వచ్చింది. జమిలి ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడుతాయని ప్రచారం జరిగింది. దీంతో గొర్రెల పంపిణీ ఆపేయాలని అన్ని జిల్లాల ఆఫీసర్లకు అప్పటి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చింది. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలకు ముంగట కూడా గొర్రెల పంపిణీ ప్రారంభించిన కేసీఆర్ సర్కార్, ఎన్నికలు ముగియగానే ఆపేసింది. జనరల్ ఎలక్షన్స్ సమీపించాక ఆగస్టులో రెండో విడత గొర్రెల పంపిణీని మళ్లీ ప్రారంభించి, ఎన్నికల వాయిదా ప్రచారంతో నెల రోజులకే ఆపేసింది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగి, ప్రభుత్వం మారిపోయింది.