లోక్ సభ బరిలో వారసులు

లోక్ సభ బరిలో వారసులు
  • లోక్ సభ బరిలో వారసులు
  • భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పోటీ
  • మల్కాజ్ గిరి నుంచి సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి
  • ఖమ్మం బరిలో పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి
  • పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణ
  • నల్లగొండ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న గుత్తా అమిత్ రెడ్డి
  • అదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి 

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుండటంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల వారసులు అరగేంట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రధానంగా మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొండల్ రెడ్డి అన్నకు వెన్నంటే ఉంటున్నారు. కామారెడ్డిలో తన సోదరుడి తరఫున ప్రచారం చేయడంతోపాటు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. మొన్నటి వరకు  రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగిన మల్కాజ్ గిరి నుంచి కొండల్ రెడ్డి పోటీ చేయనున్నట్టు సమాచారం. 

ఖమ్మం జిల్లా పాలేరు నుంచి సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపులో కీలక భూమిక పోషించిన ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నట్టు సమాచారం. పాలేరులో తన సోదరుడికి 50 వేల ఓట్ల మెజార్టీ సాధించడంలో ప్రసాద్  రెడ్డి కీలకంగా వ్యవహరించారు. తన సోదరుడు గతంలో ఎంపీగా పనిచేసిన ఖమ్మం సెగ్మెంట్ నుంచి ఆయన బరిలోకి దిగనున్నారని సమాచారం. 

చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణ సైతం ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం. ఆయన తన తాత, తండ్రి ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తోంది. మరో కీలక నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఈ సారి నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇటీవలే జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సారి ఆయన మరో కుమారుడు  రఘువీర్ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. 

అదే జిల్లాలోని మరో  పార్లమెంటు నియోజకవర్గం భువనగిరి నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ బరిలోకి దిగనుంది. మొన్నటి వరకు అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి  పోటీలో నిలుస్తారని సమాచారం. లేదా వాళ్ల సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్య పవన్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత శాసన మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి బీఆర్ఎస్ తరఫున అతడిని తాను గతంలో ప్రాతినిధ్యం వహించి నల్లగొండ నుంచే బరిలోకి దింపుతారని తెలుస్తోంది.