
చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందని, విడుదల తేదీని మారుస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రాన్ని రీషూట్ చేయడమే దీనికి కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ రూమర్స్‌కి చెక్ పెడుతూ నిర్మాతలు నిన్న క్లారిటీ ఇచ్చారు. ‘రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ‘ఆచార్య’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తయ్యింది. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుంది’ అని చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు చరణ్. చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.