
వాషింగ్టన్: లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్‌ను బయటపెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. ఆ ఫైల్స్‌లో ఎంతమంది పేర్లు ఉన్నాయో బయటపెట్టాలని ‘ఎక్స్’లో ఆయన డిమాండ్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి తన టీమ్ మెంబర్లపై విమర్శల దాడి ఆపాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరిన నేపథ్యంలో మస్క్ ఈమేరకు స్పందించారు. ఎప్స్టీన్ వద్ద క్లైంట్ల లిస్ట్ లేదని, ప్రముఖులను ఆయన మోసగించినట్లు ఆధారాలు కూడా లేవని జస్టిస్ డిపార్ట్మెంట్, ఎఫ్‌బీఐ గత వారం ఓ ప్రకటన విడుదల చేశాయి.
అప్పటి నుంచి ట్రంప్‌పై ఆయన మద్దతుదారులే విరుచుకుపడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లిస్టును బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వారికి ఎలాన్ మస్క్ కూడా జత కలిశారు. అయితే, మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో ఎప్స్టీన్ ఫైల్స్ క్రియేట్ చేశారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీని వెనుక కొంతమంది కుట్ర ఉందని, ఇందులో మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) సపోర్టర్లు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.