అంబానీ.. ఆసియాలోనే రిచెస్ట్..నికర సంపద రూ.9.68 లక్షల కోట్లు

అంబానీ.. ఆసియాలోనే రిచెస్ట్..నికర సంపద  రూ.9.68 లక్షల కోట్లు
  •     రెండో స్థానంలో గౌతమ్​ అదానీ
  •     శివ్​నాడార్​కు మూడోస్థానం

న్యూఢిల్లీ : రియలన్స్​ ఇండస్ట్రీస్ ​చైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇండియాతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నికర సంపద 116 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.9.68 లక్షల కోట్లు) ఉందని అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన "ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024: ది టాప్ 200"లో వెల్లడించింది. ఇందులో 200 మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం 169 మంది ఉన్నారు. ఈ భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రికార్డు స్థాయిలో 954  బిలియన్ డాలర్లు ఉంది.

అంబానీ100 బిలియన్ డాలర్ల క్లబ్‌‌లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు.  ప్రపంచంలోని తొమ్మిదవ అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 84 బిలియన్ డాలర్లతో రెండవ అత్యంత సంపన్న భారతీయుడుగా ఉన్నారు. భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్​ఎదిగారు. మనదేశంలో నాలుగో సంపన్న భారతీయురాలు కూడా.  ఈమె నికర సంపద 33.5 బిలియన్ బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ 2024 జాబితాలో తొలిసారిగా 25 మంది భారతీయ బిలియనీర్లు అడుగుపెట్టారు.  

వీరిలో నరేష్ ట్రెహాన్ (మెదాంత మేనేజింగ్ డైరెక్టర్), రమేష్ కున్హికన్నన్ (కేన్స్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్),  రేణుకా జగ్తియాని (ల్యాండ్‌‌మార్క్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ఉన్నారు.  ఈసారి బైజు రవీంద్రన్,  రోహికా మిస్త్రీకి ఈ లిస్టులో స్థానం దక్కలేదు. బెర్నార్డ్ ఆర్నాల్ట్  కుటుంబం మొత్తం నికర విలువ 233 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా తరువాతిస్థానాల్లో ఎలోన్ మస్క్ (195 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (194 బిలియన్ డాలర్లు) ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత మంది బిలియనీర్లు ఈసారి ఉన్నారని ఫోర్బ్స్​తెలిపింది. వీరి సంఖ్య 2,781కు చేరింది.  

అత్యంత సంపన్న భారతీయులు (సంపద బిలియన్​ డాలర్లలో)

1.ముకేశ్‌ అంబానీ             116  
2. గౌతమ్ అదానీ               84  
3.శివ నాడార్                    36.9  
4.సావిత్రి జిందాల్          33.5  
5.దిలీప్​ సింఘ్వీ              26.7
6. సైరస్ పూణావాలా      21.3
7.కుశాల్ పాల్ సింగ్       20.9  
8.కుమార్ బిర్లా                 19.7  
9. రాధాకిషన్ దమాని     17.6  
10.లక్ష్మీ మిట్టల్                16.4