రిలయన్స్ ఇన్‌‌ఫ్రాకు భారీ కాంట్రాక్ట్

రిలయన్స్ ఇన్‌‌ఫ్రాకు భారీ కాంట్రాక్ట్

వెర్సోవా–బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్‌‌

కాంట్రాక్ట్‌‌ విలువ రూ.7 వేల కోట్లు

దూసుకుపోయిన షేర్లు

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ భారీ కాంట్రాక్ట్‌‌ను చేజిక్కించుకుంది. ముంబైలోని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌‌మెంట్(ఎంఎస్‌‌ఆర్‌‌‌‌డీసీ) నుంచి రూ.7 వేల కోట్ల వెర్సోవా–బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్‌‌ కాంట్రాక్ట్‌‌ను పొందినట్టు రిలయన్స్ ఇన్‌‌ఫ్రా వెల్లడించింది. వెర్సోవా–బాంద్రా సీ లింక్‌‌ ప్రాజెక్ట్ పొడవు 17.17 కిలోమీటర్లు. 5.6 కిలోమీటర్ల పొడవున్న బాంద్రా–ఓర్లి సీ లింక్‌‌ కంటే ఇది మూడింతలు ఎక్కువ. కాంట్రాక్ట్‌‌ ప్రకారం 2019 జూన్ 24 అపాయింటెండ్ డేట్ నుంచి 60 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌‌ను    కంపెనీ పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ బీఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో తెలిపింది. వెర్సోవా–బాంద్రా సీ లింక్‌‌తో ముంబై వాసుల ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గనుంది. గత వారం రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్, రిలయన్స్ ఇన్‌‌ఫ్రా రేటింగ్‌‌ను డౌన్‌‌గ్రేడ్ చేసింది.

లాంగ్ టర్మ్ ఇస్యూర్ రేటింగ్ నుంచి డీ ఇస్యూర్‌‌‌‌ నాట్ కోపరేటింగ్‌‌కు మార్చింది. రేటింగ్ డౌన్‌‌గ్రేడ్ అయిన వారం తర్వాత అనిల్ అంబానీకి చెందిన ఈ కంపెనీ ఆడిటర్లు.. ఆర్థిక ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్‌‌ సామర్థ్యంపై మరింత సందేహం పెరిగింది. కన్సాలిడేటెడ్ బేసిస్‌‌లో మార్చి 31తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో రిలయన్స్ ఇన్‌‌ఫ్రా రూ.3,301 కోట్ల నష్టాలను రిపోర్ట్ చేసింది. అంతకుముందు ఏడాది అదే క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి రూ.133.66 కోట్ల లాభాలు వచ్చాయి. వార్షికంగా కంపెనీకి 2018–19లో రూ. 2,426.82 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది. 2017–18లో కంపెనీకి రూ.1,255.50 కోట్ల లాభాలున్నాయి.

లాభాల్లో షేర్లు

రూ.7 వేల కోట్ల వెర్సోవా–బాంద్రా సీ లింక్ ప్రాజెక్ట్‌‌ రిలయన్స్ ఇన్‌‌ఫ్రాకు దక్కడంతో ఈ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి.  రిలయన్స్ ఇన్‌‌ఫ్రా షేర్లు 18 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్‌‌ఈలో 17.44 శాతం పెరిగి రూ.60.95 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో 24.85 శాతం జంప్ చేసి రూ.64.80 వద్ద నమోదయ్యాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో కూడా 17.70 శాతం ఎగిసి రూ.61.15 వద్ద స్థిరపడ్డాయి. షేర్లు ఈ మేర లాభపడటంతో, కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ కూడా రూ.238.92 కోట్లు పెరిగి రూ.1,602.92 కోట్లకు చేరింది. బీఎస్‌‌ఈలో 67.62 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో 7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.