
దేశంలోని టెలికాం యూజర్లకు మరోసారి ముఖేష్ అంబానీ షాక్ ఇచ్చారు. ఈసారి రిలయన్స్ జియో తన అత్యంత ప్రజాధరణ పొందిన 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు1జీబీ డేటా బేసిక్ ప్లాన్ రూ.209, అలాగే 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.249 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తొలగించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, తక్కువ ఖర్చుతో మొబైల్ వాడేవాళ్లను నిరాశకు గురిచేస్తోంది.
రిలయన్స్ జియో తాజా నిర్ణయంతో ఇకపై స్మార్ట్ ఫోన్ యూజర్లు కనీసం నెలకు రూ.299 రీఛార్జ్ ప్లాన్ కి మారాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ ప్లాన్ కింద 28 రోజుల వ్యాలిడిటీతో 1.5జీబీ డేటాను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లను కూడా ఇందులో అందిస్తోంది.
మార్కెట్లోని ఇతర టెలికాం ఆపరేటర్లైన ఎయిర్ టెల్, విఐ వంటి కంపెనీలు కూడా కనీసంగా రూ.299 నుంచే ప్లాన్లు అందిస్తున్నారు. జియో కూడా ప్రస్తుతం వీటి సరసన చేరిపోయింది. మార్పు కారణంగా డేటా తక్కువ అవసరం ఉండే వ్యక్తులపై కూడా ఖర్చు పెరగనుంది. దీంతో తక్కువ డేటా అవసరంగా ఉన్నా, ఎక్కువ జీబీ నమోదు చేసే ప్లాన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టెలికాం రంగంలోని సంస్థలు రానున్న నెలల్లో మరోసారి టారిఫ్స్ పెంపులకు వెళ్లొచ్చనే వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. సంస్థలు సగటు యూజర్ల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు అలాగే 5జీ విస్తరణ ఖర్చులను ఆఫ్ సెట్ చేసుకునేందుకు రేట్ల పెంపుకు వెళుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జియో బేసిక్ ప్లాన్లను తొలగించటం కూడా యూజర్ల నుంచి ఆదాయాన్ని పెంచుకోవటానికి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. వాస్తవానికి జియో ఆదాయంలో రూ.249 ప్లాన్ వాటా 10%లోపే ఉన్నప్పటికీ.. ముఖ్యమైన 'లో-బడ్జెట్' ప్లాన్స్ ఆపేయటం యూజర్లను నిరాశకు గురిచేసింది. దీంతో చాలా మంది తక్కువ రేటుకు ప్లాన్స్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కి మారేందుకు చూస్తు్న్నారు.