యూజర్స్ కు జియో సినిమా షాక్.. ఇక నుంచి డబ్బులు కట్టాల్సిందేనని వెల్లడి

యూజర్స్ కు జియో సినిమా షాక్.. ఇక నుంచి డబ్బులు కట్టాల్సిందేనని వెల్లడి

జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తోన్న రిలయన్స్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను  జియో సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌, వాల్ట్‌ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలని రిలయన్స్ భావిస్తోంది.అంతే కాకుండా కంటెంట్‌కు ఇకపై డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతలోనే ఓ కీలక నిర్ణయాన్నీ వెల్లడించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు మాత్రం ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని ప్రకటించింది.

ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న వయాకామ్‌ 18.. జియో సినిమా యాప్‌ ద్వారా ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను అందిస్తోంది. ఉచితంగా సేవలు లభిస్తుండడంతో ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. పాత రికార్డులను సైతం బద్దలు కొడుతున్న జియో సినిమా.. ఐపీఎల్‌ ద్వారా జియో సినిమాకు వచ్చిన ఆదరణను కొనసాగించడం కోసం జియో సినిమాలో కొత్తగా కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ అనుకుంటోంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌పాండే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొత్తగా కంటెంట్‌ యాడ్‌ చేశాక.. ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది ఎంత మేర వసూలు చేయాలనేది మాత్రం ఇంత వరకు నిర్ణయించలేదని  స్పష్టం చేశారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆ సమయంలోపే కొత్త కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ భావిస్తోందని జ్యోతి దేశ్‌ పాండే తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను మాత్రం యథాతథంగా ఉచితంగా చూడొచ్చని చెప్పారు. జియో సినిమాకు వసూలు చేసే మొత్తాన్ని అందుబాటు ధరలోనే ఉంచాలని చూస్తున్నామని, దానికి తోడు దేశీయ కంటెంట్‌ను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి వారంలోనే 5.5 బిలియన్‌ యునిక్‌ వ్యూస్‌ను సొంతం చేసుకున్న జియో సినిమా.. ఏప్రిల్‌ 12న జరిగిన చెన్నై- రాజస్థాన్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 22 మిలియన్ల  మంది చూశారని ఆ సంస్థ తెలిపింది.