చెన్నూరు, వెలుగు: చెన్నూరు ఎస్‌బీఐ బ్రాంచ్–2 గోల్డ్ లోన్ బాధితులకు బంగారు ఆభరణాలు అప్పగించే ప్రక్రియను బ్యాంకు అధికారులు గురువారం ప్రారంభించారు. నిజామాబాద్ డీజీఎం విజయభాస్కర్ సాహు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏజీఎం) సంజయ్ అప్పాజీ, నిజామాబాద్ ఏవో సెక్యూరిటీ ఆఫీసర్ రాజేశ్ యాదవ్, స్థానిక బ్రాంచ్ మేనేజర్ రాజేశ్, సీఐ బన్సీలాల్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య రుణాలు పూర్తిగా చెల్లించిన బాధితులకు ఆభరణాలను అందజేశారు.
ప్రస్తుతం రోజుకు ఐదుగురు బాధితులకు బంగారం అప్పగించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే రుణ బకాయిలను వేగంగా చెల్లిస్తే రోజుకు పది మందికి నగలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
తాకట్టు పెట్టిన బంగారంపై తీసుకున్న రుణానికి సంబంధించి, గోల్డ్ స్కాం వెలుగుచూసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్న తొమ్మిది నెలల వడ్డీని మాఫీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసలు మొత్తంతో పాటు మిగిలిన వడ్డీని చెల్లించిన అనంతరం బాధితులకు వారి బంగారం అప్పగిస్తున్నామని తెలిపారు.
