Pawan Kalyan: 'ఓజీ'కి ఊరట: టికెట్ ధరల పెంపునకు వెసులుబాటు.. హైకోర్టులో నాటకీయ మలుపు!

Pawan Kalyan: 'ఓజీ'కి ఊరట: టికెట్ ధరల పెంపునకు వెసులుబాటు.. హైకోర్టులో నాటకీయ మలుపు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీకి తెలంగాణ హైకోర్టు కొంత ఊరట లభించింది.  టికెట్ ధరల పెంపు విషయంలో నిన్న ( బుధవారం ) సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ శుక్రవారం వరకు స్టే విధించింది.  దీంతో ఈ రోజు చిత్ర యూనిట్‌కు స్వల్ప ఊరట లభించినట్లైంది . అయితే ఆ తీర్పుపై మళ్లీ కోర్టులోనే సస్పెన్షన్ పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణ ప్రభుత్వం 'ఓజీ' ప్రీమియర్స్‌ ప్రదర్శనతో పాటు, విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఒక మెమో జారీ చేసింది. అయితే, ఈ మెమోను సవాలు చేస్తూ మహేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం (నిన్న) ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి .. ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా 'ఓజీ' చిత్ర యూనిట్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే, వెంటనే  చిత్ర బృందం, ఈ సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

ఓజీకి ఊరట..

ఈ రోజు ( గురువారం ) విచారణ జరిపిన డివిజన్ బెంచ్‌..  సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం (రేపటి) వరకు సస్పెండ్ చేయడం జరిగింది.  దీంతో గురువారం (నేడు), శుక్రవారం (రేపు) పెరిగిన ధరలకే టికెట్లను విక్రయించుకునే వెసులుబాటు 'ఓజీ' చిత్ర యూనిట్‌కు లభించింది. ఈ రెండు రోజుల్లో వసూలయ్యే పెరిగిన టికెట్ ధరలు చిత్ర వసూళ్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.  తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరపై పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

ALSO READ : వచ్చే పండక్కి.. OTTలోకి 'OG '

కోర్టు ఫైనల్ తీర్పు ఎప్పుడు?

పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే జరిగిన ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ రావడంతో, తొలి రోజు వసూళ్లపై ఈ టికెట్ పెంపు నిర్ణయం చాలా కీలకం కానుంది.

ప్రభుత్వం నిజానికి అక్టోబరు 4 వరకు ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే, ప్రస్తుత డివిజన్ బెంచ్ తీర్పు కేవలం రెండు రోజులకు (సెప్టెంబర్ 25, 26) మాత్రమే పరిమితం కావడంతో, ఆ తర్వాత ఈ విషయంలో కోర్టు ఎలాంటి సవరణలు చేస్తుందనేది వేచి చూడాలి. శుక్రవారం మరోసారి దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ న్యాయ పోరాటంలో 'ఓజీ' టీమ్‌కు వారం రోజుల పూర్తి అనుమతి లభిస్తుందా, లేక టికెట్ ధరలు మళ్లీ పాత స్థాయికి చేరుకుంటాయా అనేది తెలియాలంటే కోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు వేచి చూడక తప్పదు.