ఫైనాన్స్​ బిల్లులో సవరణ తెచ్చిన ​ మినిస్టర్​

ఫైనాన్స్​ బిల్లులో సవరణ తెచ్చిన ​ మినిస్టర్​

న్యూఢిల్లీ: కొత్త ట్యాక్స్​ విధానం ఎంచుకున్న వారిలో రూ. 7 లక్షలకు మించి కొద్దిగానే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం రిలీఫ్​ ప్రకటించింది. నో–ట్యాక్స్​ సీలింగ్​ రూ. 7 లక్షలు కాబట్టి, అంతకు మించి ఉన్న ఆదాయంపై మాత్రమే ఆదాయపు పన్ను కడితే సరిపోతుందని తెలిపింది. ఏప్రిల్​ 1, 2023 నుంచి కొత్త ట్యాక్స్​ విధానం అమలులోకి వస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్​ తెచ్చినప్పుడు రూ. 7 లక్షల దాకా ఆదాయంపై పన్ను ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రూ. 7 లక్షలకు పైన రూ. 100 ఎక్కువ ఆదాయం ఉన్నా రూ. 25,010 ఆదాయపు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 100 అదనపు ఆదాయం ఉండటం వల్ల రూ. 25,000 ఆదాయపు పన్ను భరించాల్సి వస్తుందన్న మాట. ఈ నేపథ్యంలో అలాంటి వారికోసం కొంత రిలీఫ్​ను తాజాగా తెచ్చారు.

రూ. 7 లక్షలకు మించి ఎంత మొత్తమైతే అదనంగా సంపాదన ఉంటుందో, అంతే మొత్తం మీద పన్ను చెల్లిస్తే సరిపోయేలా సవరణ చేశారు. పై ఉదాహరణ చూస్తే, రూ. 100 అదనపు ఆదాయంపైన మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తే సరిపోతుందన్న మాట. రూ. 7,27,700  దాకా ఆదాయం ఉన్న వ్యక్తులకు ఈ రిలీఫ్​ బెనిఫిట్​ కల్పిస్తుందని నంగియా యాండర్సన్​ ఎల్​ఎల్​పీ పార్ట్​నర్​ సందీప్​ జున్​జున్​వాలా చెప్పారు. శాలరీ ఆదాయం పొందే మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో బడ్జెట్​లో రూ. 7 లక్షల దాకా ఆదాయపు పన్ను ఉండదనే ప్రపోజల్​ను పెట్టారు. అయితే, ఈ రిలీఫ్​ ఎంత మొత్తం దాకా వర్తిస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ట్యాక్స్ ఎక్స్​పర్టుల లెక్కల ప్రకారం రూ. 7,27,777 దాకా ఆదాయం ఉండే వ్యక్తులకు ఈ  బెనిఫిట్​ దొరుకుతుంది.