రైతులకు, రైస్ ​మిల్లర్లకు ఊరటనిచ్చిన కేంద్ర నిర్ణయం

రైతులకు, రైస్ ​మిల్లర్లకు ఊరటనిచ్చిన కేంద్ర నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం ద్వారా రా రైస్ బదులుగా 8 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఊరటనిచ్చింది. రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతాంగానికి, రైస్ మిల్లులకు ఇది గొప్ప శుభవార్త. కేంద్రం నిర్ణయంతో మార్కెట్​లో వడ్లకు, బియ్యానికి సరైన ధర లభిస్తుంది. ఇప్పటికే రైస్ మిల్లుల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోగా, 8 లక్షల టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలంగాణలో సంక్షోభంలో ఉన్న రైస్ మిల్లు పరిశ్రమకు మేలు చేసినట్లే. సర్కారు సేకరించిన వడ్లు రైస్ మిల్లులో పేరుకుపోయి, వర్షాల వల్ల కొంత పాడైంది. యాసంగి పంట కాబట్టి రా రైస్ ఉత్పత్తికి అనుకూలం కాదు. ఇలాంటి పరిస్థితుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లులు గత ఐదు నెలలుగా మూతపడి సంక్షోభంలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభేదాల మధ్యన వరి పంటకు సరైన ధర లభిస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులు ధైర్యంగా వరి పంట వేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. '

మిల్లింగ్ ​పరిశ్రమ ఆధునీకరణ

రైతాంగం పండించిన పంటలకు సరైన ధర దొరికేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రాంట్ గా ఇస్తున్న విషయం గమనించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ద్వారా కోట్ల రూపాయల గ్రాంట్ తెలంగాణ రాష్ట్రానికి లభించే అవకాశం ఉన్నా గత కొంతకాలంగా ధాన్యం సేకరణ విషయంలో నెలకొన్న సందిగ్ధత వల్ల రైస్ మిల్లు పరిశ్రమ ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రైస్ మిల్లు పరిశ్రమ కొంత గట్టెక్కే అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ద్వారా లభించే గ్రాంట్ల ద్వారా ప్రపంచ స్థాయి రైస్ మిల్లులను నెలకొల్పే అవకాశం ఉంటుంది. ఫలితంగా వరి పండించే రైతులకు సరైన ధర, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం దొరుకుతాయి. ఆ సరుకును ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో రైతులు రెండు సీజన్లలో కూడా వరి పంట వేసేందుకే మొగ్గుచూపుతున్నారు. వారు పండించే పంటను ప్రాసెస్​చేసి విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉంటే రైతుకు మార్కెట్​కష్టాలు తప్పుతాయి. ఈ క్రమంలోనే రైస్ మిల్లింగ్ పరిశ్రమను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది.  తద్వారా ప్రపంచ స్థాయి నాణ్యతతో తెలంగాణ బియ్యానికి బాస్మతి బియ్యం తరహాలో ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావొచ్చు. 

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు

కేంద్ర ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా ప్రపంచ శ్రేణి బియ్యం నాణ్యతని సాధించడానికి ప్రస్తుతం తెలంగాణలో పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పండించి, మిల్లింగ్ చేసిన బియ్యానికి అనేక దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో 3000 రైస్ మిల్లింగ్ పరిశ్రమలు ఉంటే వీటిలో ఒక వంద మాత్రమే ప్రపంచ స్థాయి మిషనరీతో ఎగుమతులకు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో వరి ఒక ప్రధాన పంట. దానికి మద్దతు ధర కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రపంచ స్థాయి రైస్ మిల్లుల ఏర్పాటుకు తన వంతు బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర రైస్​మిల్లింగ్​పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. కాబట్టి ప్రభుత్వాలు రైతుల మేలు కోసం తీసుకునే నిర్ణయాలతో రైస్ మిల్లు పరిశ్రమకు కూడా మేలు జరుగుతుంది. రైస్ మిల్లింగ్ పరిశ్రమ ఆధునీకరణకు కేంద్రం ఇస్తున్న గ్రాంట్లు కూడా రైతాంగానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నఎఫ్ సీఐ సిబ్బంది సహకరిస్తే 8 లక్షల టన్నుల బాయిల్డ్​రైస్​సేకరణ త్వరగా పూర్తయి వానాకాలం వడ్ల సేకరణకు ఇబ్బందులు తప్పుతాయి. డాలర్ విలువ పెరిగి, విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నందున వడ్లను బియ్యంగా మార్చి ఎగుమతి చేస్తే దేశానికి ఎంతో ప్రయోజనం. అయితే ప్రపంచ బియ్యం మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరలతో ఎగుమతికి అవకాశాలు లేవు కాబట్టి పోర్టుల దాకా బియ్యాన్ని రవాణా చేయడానికి అయ్యే ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే పెద్ద మొత్తంలో బియ్యం ఎగుమతి చేయొచ్చు. వరి పండించే రైతులను కాపాడుకోవాలంటే మిల్లింగ్​పరిశ్రమల ఆధునికీకరణ, నాణ్యమైన బియ్యం ఎగుమతి ఒక్కటే మార్గం.

- తూడి దేవేందర్ రెడ్డి,

మాజీ అధ్యక్షుడు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్