ఈ నెలాఖరుకల్లా మార్కెట్​లోకి రెమ్‌డెసివిర్

ఈ నెలాఖరుకల్లా మార్కెట్​లోకి రెమ్‌డెసివిర్

న్యూఢిల్లీ: కరోనా తీవ్రత ఎక్కువైన వారికి అందించే రెమ్​డెసివిర్ ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది. కరోనా పేషెంట్లకు అత్యవసర పరిస్థితులలో రెమ్​డెసివిర్ వాడేందుకు ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. దీంతో దేశీయంగా తయారు అవుతున్న రెమ్‌డెసివిర్ కొద్ది రోజుల్లోనే విస్తృతంగా అందుబాటులోకి రానుందని ఫార్మా కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన పరిశోధనాత్మక యాంటీ-వైరల్ థెరపీ అయిన రెమ్​డెసివిర్ అమ్మకాలకు కండిషన్ల మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.

అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఈ ఔషధానికి అమెరికా ఫుడ్​అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. గిలియడ్ సైన్సెస్ కంపెనీతో ఇండియాకు చెందిన ఐదు ఫార్మా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్ వంటివి ఉన్నాయి. ఈ డీల్ ప్రకారం రెమ్​డెసివిర్ ను తయారు చేసి ఇండియాతో పాటు తదితర దేశాలలో అమ్మకాలు చేపట్టవచ్చు. కాగా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ కంపెనీలకు అనుమతులు లభించిన నేపథ్యంలో రెమిడిసివిర్ ను త్వరలోనే మార్కెట్​లోకి అందుబాటులోకి తెస్తామని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, 12 ఏండ్ల లోపు పిల్లలకు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రెమిడెసివిర్ వాడకానికి కేంద్ర ఆరోగ్య శాఖ పర్మిషన్ ఇవ్వలేదు.