లోన్ల ఏజెంట్లు సతాయిస్తే సాయం దొరుకుతది!

లోన్ల ఏజెంట్లు సతాయిస్తే సాయం దొరుకుతది!

లోన్ రికవరీ కోసం ఏజెంట్లు బెదిరించడం, అవమానించడంతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వీరి చేష్టల కారణంగా బ్యారోవర్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏజెంట్లు చాలా రకాలుగా ఖాతాదారులను వేధిస్తున్నారు.   తరచుగా కాల్ చేయడం లేదా ఖాతాదారుల ఇండ్లకు రోజూ రావడం, మొబైల్‌‌‌‌లో లేదా సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, పొరుగువారికి కాల్ చేయడం లేదా బంధువుల ఎదుట పరువు తీయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి కష్టాలు వస్తే బాధితులు ఏం చేయాలో తెలుసుకుందాం...

బిజినెస్​ డెస్క్, వెలుగు: ఇంతకుముందు బ్యాంకుల ద్వారా, ఎన్​బీఎఫ్​సీల ద్వారా లోన్లు తీసుకోవాలంటే చాలా పేపర్​వర్క్​ ఉండేది. రోజూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ష్యూరిటీ సంతకాలు, కొల్లటేరల్​ అంటూ బ్యాంకులు తిప్పించుకునేవి. ఇప్పుడు ఆన్​లైన్​లో సెకన్లలో అప్పు పుడుతోంది. క్రెడిట్​స్కోర్​ బాగుంటే లెండర్లే ఫోన్లు చేసి లోన్​ తీసుకోవాలని బతిమాలుతున్నారు. ఇక్కడి వరకు ఓకే కానీ బ్యారోవర్​ (అప్పు తీసుకున్న కస్టమర్​) అప్పు తీర్చలేకపోతే మాత్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా వచ్చాక చాలా మంది కిస్తీలు కట్టలేక సతమతమవుతున్నారు. ఎంతో మంది జాబ్స్​కు దూరమయ్యారు. మరికొందరు జీతాలు తగ్గి కష్టాలు పడుతున్నారు. దీంతో కొన్ని కేసులు కోర్టుల దాకా వెళ్తున్నాయి. బాకీలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లు ఇల్లీగల్​ పనులు చేస్తున్నట్టు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యారోవర్లు పేదలు, వృద్ధులు, అణగారినవర్గాల వాళ్లు అయితే వారితో ఏజెంట్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్లు రావడం  మిగతావారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ వీరి ప్రవర్తన కారణంగా బ్యారోవర్ల ప్రాణాలుపోయిన సందర్భాలు ఉన్నాయి.  చీటిమాటికీ కాల్ చేయడం, బ్యారోవర్​ ఇంటికి క్రమం తప్పకుండా రావడం, మొబైల్‌‌లో లేదా సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, పొరుగువారికి కాల్ చేయడం, బంధువుల ఎదుట  పరువు తీయడం లేదా బెదిరించడం వంటివి పనులు చేస్తున్నారు. కొందరు ఏజెంట్లు బ్యారోవర్లను  పబ్లిక్‌‌గా అవమానిస్తున్నారు. మరికొందరు ఖాతాదారుల బాస్‌‌ల దగ్గర వెళ్లి బకాయిలు గురించి చెబుతున్నారు. ఇలాంటివన్నీ కూడా వేధింపులేనని బ్యాంకింగ్ సెక్టార్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఏజెంట్ తన ఆఫీసు నుంచి బ్యారోవర్​కు ఫోన్​ చేసినా, రిమైండర్​ పంపినా వేధింపుగా చూడరు. అక్రమ పద్ధతుల్లో వేధిస్తే మాత్రం కోర్టులు రికవరీ ఏజెంట్లపై కఠినమైన చర్యలు తీసుకుంటాయి. 

ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలి...
డబ్బును రికవరీ చేయడానికి అక్రమపద్ధతులు ఉపయోగించడం చట్టవిరుద్ధమని, డిఫాల్టర్​ అయితే తమను ఆశ్రయించాలని కోర్టులు చాలాసార్లు చెప్పాయి. అయినప్పటికీ ఏజెంట్లు మోటు పద్ధతుల్లో బ్యారోవర్లను బెదిరిస్తున్నారు.  బ్యాంక్ లేదా రికవరీ ఏజెంట్ వేధిస్తే, క్లయింట్ ముందుగా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయవచ్చు. కోర్టులకు వెళ్లే ముందు ఈ పనిని తప్పనిసరిగా చేయాలి. పోలీసుల నుండి ఉపశమనం లభించకపోయినా లేదా ఎఫ్​ఐఆర్​ దాఖలు చేయకపోయినా, సివిల్ కోర్టుకు కూడా వెళ్లవచ్చు.  ఉపశమనం కోసం పిటిషన్​ వేయొచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో క్లయింట్‌‌కు అనుకూలంగా తీర్పు రావొచ్చు.  వేధించడం మానాలని ఏజెంట్​ను ఆదేశించవచ్చు. న్యాయస్థానం ఖాతాదారులకు ఉపశమనం కలిగించి, ఇరుపక్షాలకు మేలు చేసే మార్గాన్ని సూచించే అవకాశాలూ ఉంటాయి.  ఆర్​బీఐలో కూడా బ్యారోవర్​ ఫిర్యాదు చేయవచ్చు. రికవరీ ఏజెంట్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టు తేలితే ఆర్​బీఐ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఆర్​బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, బ్యాంక్  లోన్ రికవరీ ఏజెంట్ తప్పనిసరిగా కొన్ని గైడ్​లైన్స్​ పాటించాలి. మర్యాదగా ప్రవర్తించాలి.  బ్యాంకుల రికవరీ ఏజెంట్లు ఈ రూల్స్​ను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. ఆయా ప్రాంతంలో రికవరీ ఏజెంట్లను నియమించకుండా  టెంపరరీగా నిషేధం విధించవచ్చు. అయినా ఏజెంట్లలో మార్పు లేకుంటే పర్మనెంట్​గా​ బ్యాన్​ చేసే అవకాశాలూ ఉంటాయి.  ఇలాంటి విషయాల్లో ఏదైనా బ్యాంకు లేదా దాని డైరెక్టర్లు/అధికారులు/ఏజెంట్‌‌లపై హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు కఠిన చర్యలు లేదా జరిమానాలు విధించినా బ్యాంకుపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఆర్‌‌బీఐకు మాత్రమే కాకుండా, బాధితుడు బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. సాధారణంగా ఏజెంట్లపై ఫిర్యాదు వచ్చినప్పుడు బ్యాంక్ సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.  వేధింపులు మానుకోవాలని ఏజెంట్లకు సూచిస్తుంది. అయినప్పటికీ, బ్యాంకు లేదా ఏజెంట్‌‌పై బాధితుడు కోర్టులో పరువు నష్టం కేసు కూడా దాఖలు చేయవచ్చు.