రిమోట్​ వంట.. ఎక్కడనుంచైనా వండొచ్చు

రిమోట్​ వంట.. ఎక్కడనుంచైనా వండొచ్చు

వంట చేయడం పెద్ద పని. బ్యాచిలర్స్‌‌కైతే అదో టాస్క్‌‌. పొద్దంతా ఆఫీస్‌‌లో పని, సాయంత్రం ఇంటికి వచ్చి వంట. ఓపిక అసలు ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది 
సార్గల శరణ్య. ‘కిచెన్‌‌ క్వీన్‌‌’ పేరుతో ఒక మెషిన్‌‌ తయారు చేసింది. మనం లేకపోయినా.. మనకు కావాల్సినట్లుగా వండిపెడుతుంది ఆ మెషిన్‌‌. అంతేకాదు.. అమ్మ చేతి వంట తినాలన్నా.. నాన్నమ్మ చేతి పచ్చడి కావాలన్నా చేసిపెడుతుంది ఈ మెషిన్‌‌. అదేంటో? ఎలా పని చేస్తుందో ‘లైఫ్‌‌’తో చెప్పింది శరణ్య.

“టెన్త్‌‌క్లాస్‌‌లో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి హాస్టల్‌‌లో ఉండేదాన్ని. ఫుడ్‌‌ నచ్చేది కాదు. బయట తిన్నా, ఆర్డర్‌‌‌‌ చేసుకున్నా ఇంట్లో వండినట్లు ఉండదు కదా. నేనేమో ఫుడీని. అందుకే, ఈ ప్రాబ్లమ్‌‌కి సొల్యూషన్‌గా బీటెక్​లో ఉన్నప్పుడు కొత్త మెషిన్‌‌ ఒకటి తయారు చేయాలనుకున్నా. అదే ఈ ‘కిచెన్‌‌ క్వీన్‌‌’ ఆలోచన. నా ఆలోచనకు లాక్‌‌డౌన్‌‌ కూడా కలిసొచ్చింది. టైం దొరకడంతో మెషిన్‌‌ తయారుచేయడం షురూ చేశా. నా ఫ్రెండ్‌‌ సోలమన్‌‌ జోసెఫ్‌‌ హెల్ప్‌‌ తీసుకున్నా. నా ఐడియాకి తన మెకానికల్‌‌ నాలెడ్జ్‌‌ తోడుచేసి పది రోజుల్లో ఈ మెషిన్‌‌ తయారుచేశాం. మా దగ్గర ఉన్న స్క్రాప్‌‌ మెటీరియల్‌‌తో, రెండు వేల రూపాయలు ఖర్చు చేసి ‘కిచెన్‌‌ క్వీన్‌‌’ తయారు చేశాం. ఇంటర్నెట్‌‌ ఆఫ్‌‌ థింగ్స్‌‌ (ఐవోటీ) టెక్నాలజీతో ఇది నడుస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..
‘కిచెన్‌‌ క్వీన్‌‌’ మెషిన్‌‌తో మనం ఎక్కడి నుంచైనా వంట చేయొచ్చు. మన కిచెన్‌‌లో అమ్మ, అమ్మమ్మ కూడా చేయొచ్చు. ఫోన్‌‌ ద్వారా దీన్ని ఆపరేట్‌‌ చేస్తూ, మెషిన్‌‌కి పెట్టిన కెమెరా ఆధారంగా వీడియో కూడా చూడొచ్చు. ఇది పూర్తిగా ఐవోటీ బేసిస్‌‌లో నడుస్తుంది. కూరగాయలు, పప్పులు, కావాల్సిన సామాన్లు పెట్టుకునేందుకు కొన్ని డబ్బాలు తయారు చేశాం. మనం ఏం వండాలి అనుకుంటే దానికి కావాల్సిన సరంజామా, కూరగాయల ముక్కలు డబ్బాల్లో పెట్టి ఫోన్‌‌ నుంచి ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఇస్తే సరిపోతుంది. వంట మొదలు పెట్టాల్సినప్పుడు స్టార్ట్‌‌ బటన్‌‌ నొక్కితే స్టవ్‌‌ ఆన్‌‌ చేసుకుని మనం చెప్పినట్లుగా వంట చేస్తుంది ఈ మెషిన్‌‌. పూర్తయ్యాక స్టాప్‌‌ బటన్‌‌ నొక్కితే స్టవ్‌‌ కట్టేస్తుంది. ఒక్కోసారి వర్క్‌‌ బిజీలో ఉండి మానిటర్‌‌‌‌ చేయలేని పరిస్థితి వస్తుంది.  అలాంటప్పుడు స్టార్ట్‌‌ టైం, స్టాప్‌‌ టైం సెట్‌‌చేసి, ‘పలానా కర్రీ వండేయ్‌‌’ అని ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఇచ్చి వదిలేస్తే దానికదే కూర వండేస్తుంది. మనం కాకుండా మన ఇంట్లో ఎవరైనా వంట చేయాలంటే వాళ్ల ఫోన్‌‌కి వెబ్‌‌లింక్‌‌ పంపిస్తే వాళ్లు ఆపరేట్ చేయొచ్చు. 

ప్రస్తుతం యూకేలో..
ఈ మెషిన్‌‌ తయారీ 2020 డిసెంబర్‌‌‌‌లో పూర్తయ్యింది. దీన్ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. కానీ, మాకు తగినంత సపోర్ట్‌‌ దొరకలేదు. ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి సపోర్ట్‌‌ అందలేదు. ఈలోగా నాకు, సోలమన్‌‌కు యూకేలో ఎమ్మెస్ సీట్‌‌ వచ్చింది. ఇప్పుడు యూకేలో చదువుతూ ప్రాజెక్ట్స్‌‌ చేస్తున్నాం. కిచెన్ క్వీన్‌‌కి ఇక్కడ స్పాన్సర్స్‌‌ దొరికారు. అంతా ‘ఓకే’ అయితే త్వరలోనే దీన్ని మార్కెట్‌‌లోకి తెస్తాం. మేం చదివే యూనివర్సిటీలో కూడా దీనిపై ప్రజంటేషన్‌‌ ఇవ్వాలని అనుకుంటున్నాం. కిచెన్‌‌ క్వీన్‌‌ మెషిన్‌‌ కంటే ముందు ‘రేప్‌‌ ప్రివెన్షన్ డివైజ్‌‌, అగ్రికల్చర్‌‌‌‌ రోబో,  ఐవోటీ క్రాడిల్‌‌ లాంటి’ ఐదు ప్రాజెక్ట్‌‌లు చేశాం.  

అమ్మ కల నెరవేర్చేందుకు..
మాది నిజామాబాద్‌‌ జిల్లా కమ్మర్​పల్లి. చదువులో మొదటి నుంచి టాప్‌‌లో ఉండేదాన్ని. నేను బాగా చదువుకుని, ఉద్యోగం చేయాలనేది అమ్మ కోరిక. నేను టెన్త్‌‌ క్లాస్‌‌లో ఉన్నప్పుడు చనిపోయింది. ‘ఆడపిల్లకు చదువెందుకు, పెళ్లి చేస్తాం’ అన్నారు ఇంట్లోవాళ్లు. అమ్మ కల తీర్చాలనే ఉద్దేశంతో ఎలాగైనా చదువుకోవాలనుకున్నా. ఇంట్లో వాళ్లు వద్దంటున్నా... ఒక పక్క ఉద్యోగం చేస్తూ చదువుకున్నా. నిజామాబాద్‌‌లో పాలిటెక్నిక్‌‌ చేశా. ఈ–సెట్‌‌లో 120 ర్యాంక్‌‌ వచ్చింది. హైదరాబాద్‌‌ బాచుపల్లిలోని ‘వీఎన్‌‌ఆర్‌‌ వీజేఐఈటీ’ కాలేజిలో ఎలక్ట్రానిక్స్‌‌లో ఇంజినీరింగ్‌‌ చదివా. ఆ తర్వాత రెండేండ్లు ఐవోటీ బేస్డ్‌‌ ప్రాజెక్ట్స్‌‌చేశా. యూకేలో ఎమ్మెస్‌‌ చేస్తున్నా. ఎప్పటికైనా ఇండియా తిరిగొచ్చి పెద్ద ఎంట్రప్రెన్యూర్‌‌‌‌గా సెటిల్‌‌ అవ్వాలనుకుంటున్నా. సివిల్స్‌‌కి కూడా ప్రిపేర్‌‌‌‌ అవుతున్నా. 

::: తేజ తిమ్మిశెట్టి