సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై శుక్రవారం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని జాజు హోటల్ ను పోలీసుల బందోబస్తు మధ్య పాక్షికంగా ధ్వంసం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన జాజు హోటల్ ను జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ క్రమంలో బాధితులు, కొంతమంది నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వారిని నివారించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో అక్రమ కట్టడాలను తొలిగించామని అధికారులు తెలిపారు. డ్రైనేజీ కాల్వలపై ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ అధికారి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.