రామయ్య భూముల్లో ఆక్రమణలు తొలగించండి

రామయ్య భూముల్లో ఆక్రమణలు తొలగించండి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి ఆంధ్రాలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న 917 ఎకరాల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రాలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాముడి భూములను ఆక్రమించుకుని దేవస్థానం ఆఫీసర్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాష్ట్రీయ వానరసేన ఏపీ ప్రెసిడెంట్​ ,సుప్రీం కోర్టు న్యాయవాది కె.మల్లికార్జున మూర్తి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న తర్వాత తక్షణమే రాముడి భూములకు రక్షణ కల్పించాలని, ఆక్రమణలను తొలగించాలని ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఈ భూముల ఆక్రమణలపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆదివాసీలు సైతం రామయ్య భూములను రక్షించాలంటూ ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఆంధ్రా ఆఫీసర్ల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదన్న దేవస్థానం ఈఓ శివాజీ తెలుగు రాష్ట్రాల సీఎస్​లను కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఏపీ బీజేపీ బాస్​సోము వీర్రాజు కూడా దేవస్థానం భూములను వైసీపీ లీడర్లు ఆక్రమించుకుంటున్నారని అక్కడి సర్కారుకు లెటర్లు రాశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో  రామయ్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.