15 రోజుల్లో టాటూలను తీసేయండి : పోలీసులకు.. పోలీస్ బాస్ వార్నింగ్

15 రోజుల్లో టాటూలను తీసేయండి : పోలీసులకు.. పోలీస్ బాస్ వార్నింగ్

ఒడిశా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది ఆ రాష్ట్ర స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్. 15 రోజుల్లోగా  పోలీస్ అధికారులకు ఉన్న టాటూలను తొలగించుకోవాలని లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భువనేశ్వర్ పోలీసులపై స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చాలా మంది పోలీసులు పచ్చబొట్లు కనిపించకుండా ఉండటానికి ఫుల్ స్లీవ్‌లు ధరిస్తున్నారని తెలిపింది. 

  న్యాయ నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ దాస్ స్పందిస్తూ "ఆర్మీలో టాటూలు అనుమతించబడతాయి. ఒక పోలీస్ అధికారి తన పేరు లేదా అతను ఇష్టపడే ఏదైనా థీమ్‌ను టాటూలు వేసుకుంటే, దానిని సీనియర్లు అభ్యంతరం చెప్పకూడదు. ఒక అధికారి ప్రవర్తన, వృత్తి నైపుణ్యం అతని విధి నుండి అంచనా వేయాలి. ఈ ఉత్తర్వును రద్దు చేయాలి" అని అన్నారు. 

  ఉత్తర్వులు జారీ చేసిన డీసీపీ (స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్) సుధాకర్ మిశ్రా మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఏ రకమైన టాటూ అయినా అభ్యంతరకరంగా పరిగణించబడుతుందని పోలీస్ సేవ యొక్క మర్యాదను ఉల్లంఘిస్తుందని అన్నారు. పెద్ద  సంఖ్యలో పురుషు పోలీసులు తమ శరీరాలపై పచ్చబొట్లు కలిగి ఉన్నారని స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్ కనుగొన్నట్టు తెలిపారు.

 పచ్చబొట్లు అభ్యంతరకరమైనవి, అశ్లీలమైనవి, అవమానకరమైనవని ఇది స్పెషల్ సెక్యూరిటీ బెటాలియన్ యూనిట్‌తో పాటు ఒడిశా పోలీసుల ప్రతిష్టను కించపరిచిందని  మిశ్రా తెలిపారు. టాటూలు గమనించమని ఒక టీంను పెట్టామని కొన్ని రోజులకు తీసేయకపోతే వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు.