
- బాధ్యులైన ఉద్యోగులకు మరోసారి విజిలెన్స్ నోటీసులు
- గతంలో ఇచ్చిన నోటీసులకు వర్సిటీ ఆఫీసర్ల నుంచి నో రెస్పాన్స్
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో గత వీసీ హయాంలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విజిలెన్స్ విచారణలో కదలిక వచ్చింది. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. గతంలో ఒకసారి సంబంధిత యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కొత్త వీసీ రావడం, రిజిస్ట్రార్, ఇతర పదవుల్లో వేరే ప్రొఫెసర్లను అపాయింట్ చేయడంతో అప్పటి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని సమాచారం. దీంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల విజిలెన్స్ ఎస్పీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీనివాసరావు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఫిర్యాదు కాపీని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులైన అధికారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
రూ.60 కోట్ల పనుల్లో అక్రమాలు..
శాతవాహన వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ హయాంలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సర్కార్ విచారణకు ఆదేశించింది. టెండర్ లేకుండా వరుసగా రెండేండ్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఆన్సర్ షీట్ల పనిఅప్పగించడం, అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా రిటైర్డ్ ప్రొఫెసర్లను నియమించడం, నాన్ టీచింగ్ స్టాఫ్ లెక్కల్లో గోల్ మాల్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించలేదని, వర్సిటీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఖర్చుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.60 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగాయని జూన్ 18న ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీంతో నిరుడు జులైలో విచారణ ఆదేశించగా.. 10 నెలలుగా ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలోనే బాధ్యులైన వారికి మళ్లీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఎంక్వైరీని స్పీడప్ చేయాలని యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు.
-
మరికొన్ని ఆరోపణలు..
- వర్సిటీ వాహనాల కొనుగోలు, యాక్సిడెంట్ల ఖర్చుల మీద, చలానాల చెల్లింపుల మీద ఆరోపణలు ఉన్నాయి.
- అర్హత లేని ఎం.రవీందర్ అనే రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌ను ఫైనాన్స్ ఆఫీసర్‌గా, వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ జె.ప్రభాకర్ రావును అపాయింట్ చేసుకోవడంపై విమర్శలు ఉన్నాయి.
- టెండర్ లేకుండానే పరీక్ష జవాబు పత్రాల స్కానింగ్ పనులను కోసిన్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పజెప్పడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
- బోధనేతర సిబ్బంది పీఎఫ్ డబ్బులను పీఎఫ్ ఖాతాలో జమ చేయకపోవడంపై విమర్శలు ఉన్నాయి.