సీఎం రేవంత్‌ రెడ్డితో చిరు భేటీ.. కాంగ్రెస్‌కు మెగాస్టార్ అభినందనలు

సీఎం రేవంత్‌ రెడ్డితో చిరు భేటీ.. కాంగ్రెస్‌కు మెగాస్టార్ అభినందనలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం (డిసెంబర్ 24న) కలిశారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి చిరంజీవి అభినందనలు తెలిపారు. రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనను చిరంజీవి కలవడం ఇదే తొలిసారి.

2009 ఎన్నికలకు ముందు చిరంజీవి.. ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 288 స్థానాలలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి గెలుచుకున్న రెండు సీట్లు తీసేస్తే సీమాంధ్రలో సీట్లు 16 మాత్రమే. ఇక ఓట్ల శాతం గమనిస్తే ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యానికి 16.32శాతం ఓట్లు పోలయ్యాయి.

చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, రాయలసీమలోని తిరుపతి నుంచి బరిలోకి దిగగా తిరుపతి నుంచి మాత్రమే నెగ్గారు. పాలకొల్లులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓడిపోయారు. 

2009 ఎన్నికల తరువాత రెండేళ్లలోనే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయనకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.