అద్దెకు రైతు వేదికలు!

అద్దెకు రైతు వేదికలు!

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: స్టేట్​లో టీఆర్ఎస్​ సర్కార్​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు ఫంక్షన్​ హాల్స్​గా మారనున్నాయి. గతేడాది రైతు వేదికల నిర్మాణాలపై సీఎం కేసీఆర్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసర్లు, సర్పంచులు అందరిపై ఒత్తిడి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా నవంబర్​నాటికి చిన్నచిన్న పనులు మినహా బిల్డింగ్​లను మాత్రం పూర్తి చేశారు. రైతు వేదికలను నిర్మించారు కానీ మెయింటెనెన్స్​కు టీఆర్ఎస్​ సర్కార్​ ఫండ్స్​ఇవ్వలేదు. మెయింటెనెన్స్​డబ్బుల కోసం రైతు వేదికలను కార్యక్రమాలకు అద్దెకిచ్చుకోవాలని సర్కార్​ మౌఖిక ఆదేశాలను జారీ చేసినట్టుగా అగ్రికల్చర్​ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

చేతులెత్తేసిన పంచాయతీలు

రాష్ట్రంలో 2,604 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో 40 నుంచి 80 వరకు రైతు వేదికలను సర్కార్​ నిర్మించారు. ఇందుకుగానూ ఉపాధిహామీ పథకం, అగ్రికల్చర్ ​నుంచి ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షలను గవర్నమెంట్​ కేటాయించింది. ఇందులో భాగంగానే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 67 రైతు వేదికలను నిర్మించాలని ఆఫీసర్లు టార్గెట్​గా పెట్టుకున్నారు. ఇందులో కనీసం రెండు మూడింటినైనా గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించాలని ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. కానీ అనుకున్నట్టుగా పనులు కాలె. అక్టోబర్​ చివరినాటికి చిన్నచిన్న పనులు మినహాయిస్తే బిల్డింగ్​లను మాత్రం ఆఫీసర్లు పూర్తి చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్​లోనే ఉండటంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. వేదికలను తొందరగా పూర్తి చేయాలని వేధించిన ఆఫీసర్లు బిల్లులు ఇవ్వమని అడిగితే మాత్రం సర్కారు నుంచి డబ్బులు రాలేదని చెప్పి తప్పించుకుంటున్నారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.

బిల్డింగ్​ పనులు పూర్తి చేసినప్పటికీ నీళ్ల కోసం బోర్, ప్రహరీ, మొక్కల పెంపకం వంటి ఇతరత్రా వాటికి ఫండ్స్​ లేకపోవటంతో ఆ భారాన్ని సర్కార్ పంచాయతీల మీద వేసింది. చిన్న పంచాయతీలైతే మేం ఫండ్స్​ కేటాయించలేమంటూ చేతులెత్తేశాయి. దీంతో పలుచోట్ల నీటి సౌకర్యం లేకుండాపోయింది. రైతు వేదికలను నిర్మించాలని చెప్పిన సర్కార్​ వాటి మెయింటెనెన్స్​కు మాత్రం ఒక్క పైసా కేటాయించలేదు. ఇప్పటికే కొన్ని రైతు వేదికలకు కరెంటు బిల్లులు వచ్చాయి. గవర్నమెంట్​ ఫండ్స్​ కేటాయించకపోవడంతో మేం ఎక్కడి నుంచి కరెంటు బిల్లులు కట్టాలంటూ అగ్రికల్చర్​ ఆఫీసర్లు వాపోతున్నారు. మరోవైపు వేదికలను ఊడ్చటం, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ వర్కర్​ అవసరం ఉంది. వర్కర్​ను పెట్టుకుని పంచాయతీ ఫండ్స్​నుంచే జీతం ఇయ్యాలంటూ సర్కార్​ మౌఖికంగా పేర్కొంటుండంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఫంక్షన్స్​, మీటింగ్​లు, ఇతర ప్రోగ్రాంలకు అద్దెకిచ్చుకోండంటూ సర్కార్​ మౌఖిక ఆదేశాలను అగ్రికల్చర్​ఆఫీసర్లకిచ్చింది. దీంతో మెయింటెనెన్స్​పైసల కోసం వేదికలను ఆఫీసర్లు ఫంక్షన్ ​హాల్స్​గా మార్చనున్నారు. ఆ మండలంలో ఉన్న డిమాండ్​ఆధారంగా రోజుకింతని అద్దె నిర్ణయించనున్నారు.