క్యాంపెయిన్ కోసం గాలిమోటర్లు రెంట్.. గంటకు రూ. 2 లక్షలు.. రోజు అయితే రూ. 15 లక్షలు

క్యాంపెయిన్ కోసం గాలిమోటర్లు రెంట్.. గంటకు రూ. 2 లక్షలు.. రోజు అయితే రూ. 15 లక్షలు
  • తలా రెండుహెలికాప్టర్లు కిరాయికి తీసుకున్న బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీ 
  • ముఖ్యమైన లీడర్లంతా వీటిద్వారానే ప్రచారానికి 
  • గంటకు రూ. 2 లక్షలు.. రోజువారీగా అయితే రూ. 15 లక్షలు రెంట్

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హైటెక్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యమైన లీడర్లంతా హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్​ చేసేలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లోని మెయిన్ లీడర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు. అయితే, స్టార్​ క్యాంపెయినర్ల లిస్ట్​లో ఉన్నోళ్లకే హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తుండటంతో ఈ ఖర్చంతా అభ్యర్థుల ఖాతాల్లోకి కాకుండా ఆయా పార్టీల ఖాతాల్లోకి వెళ్తోంది. మూడు  ప్రధాన పార్టీలు ఇప్పటికే 6 హెలికాప్టర్లను వాడుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలై.. ప్రచారం ముగిసేనాటికి మరో నాలుగైదు హెలికాప్టర్లు వీటికి జతయ్యే అవకాశం ఉన్నది. 

గత 2018 ఎన్నికల్లో 5 హెలికాప్టర్లను వినియోగించారు. అప్పట్లో ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయివాళ్లే హెలికాప్టర్లను వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నేతలు సైతం ప్రచారానికి గాలిమోటర్లను వినియోగిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ రెండు హెలికాప్టర్లను రెండు నెలల పాటు అద్దెకు తీసుకుంది. అటు ఢిల్లీ పెద్దలకోసం.. ఇక్కడ ముఖ్య నేతల ప్రచార అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ కూడా రెండేసి హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నాయి.  

గంటకు రూ.2 లక్షలు  

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున హెలికాప్టర్లకు మస్త్​ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎంతైనా చెల్లించేందుకు వెనకాడటం లేదు. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు చార్జ్ చేస్తున్నారు. డబుల్ ఇంజన్ అయితే గంటకు 3  లక్షల దాకా చార్జ్​ చేస్తున్నారు. ఇక రోజువారి రెంట్ ప్రకారం కావాలంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 లోపు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా చెల్లిస్తున్నారు. అయితే, ఎలక్షన్ టైంలో హెలికాప్టర్ల వినియోగానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. అద్దెకు ఇచ్చే సంస్థ, పైలట్ వివరాలు అందజేయాలి. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అనుమతి కూడా పొందాలి. ప్రొటొకాల్​ఉన్నోళ్లతో పాటు కీలకమైన నేతలు తప్పనిసరిగా డబుల్ ఇంజన్ హెలికాప్టర్ లనే వాడాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ స్థాయి హెలికాప్టర్లు అద్దెకు దొరకకపోవడంతో   బెంగళూరు, ముంబై, ఢిల్లీ సంస్థలను సంప్రదించి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. 

2018 నుంచి పెరిగిన డిమాండ్ 

రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రచారం 2018 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి బాగా పెరిగింది.  సీఎం కేసీఆర్ పార్టీ ప్రచారం కోసం 2014, 2018లలో హెలికాప్టర్లలోనే వెళ్లారు. రెండు ఎన్నికల్లో కలిపి వందకు పైగా సభల్లో ఆయన ఇలాగే పాల్గొన్నారు. ఈసారి కూడా అదే విధానంలో ముందుకు వెళ్తున్నారు. మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్​ రావు కూడా హెలికాప్టర్ల ద్వారా సభలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చాక అవసరాలకు అనుగుణంగా బీఆర్ఎస్ ఇంకో హెలికాప్టర్ ను కూడా వినియోగిం చుకునే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ మెయిన్ లీడర్లు కూడా ప్రచారానికి హెలికాప్టర్లను వాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వినియోగించారు. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్​ ఖర్గేతో పాటు ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లకు హెలికాప్టర్​లను సిద్ధం చేసి పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ హెలికాప్టర్ ను సమకూర్చుతోంది. నామినేషన్ల తర్వాత బీజేపీ కూడా రెండు హెలికాప్టర్లను ప్రచారానికి వాడనుంది.