ముందుకువడని డిగ్రీ లెక్చరర్ల భర్తీ.. నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన టీఎస్​పీఎస్సీ

ముందుకువడని డిగ్రీ లెక్చరర్ల భర్తీ.. నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ముందుకు జరగడం లేదు. 8 నెలల క్రితం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా.. ఇప్పటికీ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఆయా పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వేలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. స్టేట్​లోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (డిగ్రీ లెక్చరర్స్), ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్​ తదితర పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 491 ఉండగా, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29, లైబ్రేరియన్  పోస్టులు 24  ఉన్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని నోటిఫికేషన్​లో టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. 

వివిధ టెక్నికల్ కారణాలతో ఆ ప్రక్రియను వాయిదా వేశారు. పాలనా కారణాలతో ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత అప్లికేషన్ల ప్రక్రియను మార్చి 20కి మార్చారు.  ఆ తర్వాత కూడా అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభించలేదు. మార్చి 20న ‘దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేశాం.. ఎప్పుడు ప్రారంభమయ్యేది సమాచారం ఇస్తాం’ అని టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటించి నాలుగున్నర నెలలు అవుతున్నా.. అప్లికేషన్లు ఎప్పుడు  తీసుకుంటారో టీఎస్​పీఎస్సీ చెప్పడం లేదు. దీంతో అభ్యర్థులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డిగ్రీలో 1,138 పోస్టులు ఖాళీగా ఉంటే, వాటిలో 647 పోస్టులకు సర్కారు కోతపెట్టింది. 

నిరుద్యోగుల అసంతృప్తి 

రాష్ట్రంలో వేలాది మంది నెట్, సెట్, పీహెచ్​డీ పట్టాలు ఉండి డిగ్రీ లెక్చరర్ల  పోస్టుల కోసం  ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిగ్రీ కాలేజీల్లో తొలిసారిగా లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. చివరి సారిగా 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు దాటినా పోస్టులను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్​ పేరుతో ఈ ప్రక్రియను పక్కన పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.