IND vs ENG: మూడో టెస్టుకు బుమ్రా దూరం.. హైదరాబాదీపైనే ఆశలు!

IND vs ENG: మూడో టెస్టుకు బుమ్రా దూరం.. హైదరాబాదీపైనే ఆశలు!

తొలి టెస్టులో ఓటమి.. రెండో టెస్టులో విజయం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమం.. ఈ సమయంలో ఏ భారత అభిమాని జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమవ్వాలని కోరుకోరు. కానీ అదే జరుగుతోంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్టుకు బుమ్రా దూరమవ్వనున్నాడు. అతనికి విశ్రాంతినివ్వాలని జాతీయ జట్టు సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా సిరీస్ విజేతను నిర్ణయించే చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు బుమ్రా తాజాగా ఉంటాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఉప్పల్ గడ్డపై టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. బుమ్రా సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్ లలో 6 వికెట్లు పడగొట్టి గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  గా నిలిచాడు. ఇలా ప్రతి మ్యాచ్ లోనూ బుమ్రా కీలకం అవుతుండడంతో అతనిపై అధిక భారం పడుతోందట. ఈ క్రమంలోనే మూడో టెస్టు నుంచి బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందని నివేదికలు వస్తున్నాయి. మూడో టెస్టుకు బుమ్రా దూరమైతే.. మహమ్మద్ సిరాజ్ కీలకం కానున్నాడు.

కోహ్లీ కూడా అనుమానమే..!

వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు జట్టులో చేరతాడనేది అనుమానమే. రెండో టెస్ట్ ముగిసిన అనంతరం ద్రావిడ్ మాట్లాడుతూ.. కోహ్లీతో తాము టచ్‌లో ఉన్నట్లు, మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండే విషయమై అతనితో మాట్లాడాతమని తెలిపారు. మరి కోహ్లీకి అందుకు యెస్ చెప్తారా..! నో చెప్తారా..! అనే దానిపై స్పష్టత లేదు. మరో రెండు మూడు రోజుల్లో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే కోహ్లీ విషయంపై ఓ స్పష్టత రానుంది.