శ్రీలంకకు ఓ దండం.. పోదాం పాకిస్తాన్: తరలిపోనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‍లు!

శ్రీలంకకు ఓ దండం.. పోదాం పాకిస్తాన్: తరలిపోనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‍లు!

ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 టోర్నీకి వరుణుడి ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. టీమ్స్తో పాటు.. గెలుపు కోసం వరుణుడు పోటీ పడుతున్నాడు. ఇప్పటికే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. నేడు(సెప్టెంబర్ 4) జరుగుతున్న ఇండియా- నేపాల్ మ్యాచ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్ తరలిపోనున్నట్లు సమాచారం.

శ్రీలంకలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురవడం కామన్. దీంతో మిగిలిన మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచివుంది. లీగ్ మ్యాచ్‌లు పెద్ద ప్రభావం చూపకపోయినా.. సూపర్ -4 దశలో కీలక మ్యాచ్‌లు రద్దయితే టోర్నీయే కళ తప్పనుంది. ఈ నేపథ్యంలో క్లిష్ట వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా కప్ 2023లో మిగిలిన మ్యాచ్‌లను శ్రీలంక నుంచి పాకిస్తాన్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ జకా అష్రఫ్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

జై షాకు పీసీబీ చైర్మన్ ఫోన్!

శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లపై ప్రభావం చూపుతున్న వాతావరణ పరిస్థితులపై చర్చించేందుకు జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ జై షాకు ఫోన్ చేసినట్లు సమాచారం. వీరిద్దరూ కొన్ని నిమిషాల పాటు ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే జై షా ఏ విధంగాస్పందించారన్నది తెలియాల్సి ఉంది.

కాగా, నేపాల్‌పై విజయం, ఇండియా మ్యాచ్ రద్దవ్వడంతో.. బాబర్ ఆజం అండ్ కో ఇప్పటికే సూపర్ 4కు దూసుకెళ్లింది. మరోవైపు నేడు(సెప్టెంబర్ 4)  జరుగుతున్న భారత్‌ - నేపాల్ మ్యాచ్ లో విజయం సాధించిన టీం గ్రూప్ ఏ నుంచి అర్హత సాధించిన మరో జట్టు కానుంది.