IPL 2024: దిగొచ్చిన బీసీసీఐ.. రిషబ్ పంత్‌ రీఎంట్రీకి లైన్‌క్లియ‌ర్

IPL 2024: దిగొచ్చిన బీసీసీఐ.. రిషబ్ పంత్‌ రీఎంట్రీకి లైన్‌క్లియ‌ర్

భార‌త స్టార్ వికెట్ కీపర్ రిష‌భ్ పంత్ రీఎంట్రీపై నెల‌కొన్న సందేహాల‌కు తెర‌ ప‌డింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) 17వ సీజ‌న్‌లో పంత్ బ‌రిలోకి దిగనున్నాడు. నిన్నటి వరకూ అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చిన బీసీసీఐ ఆధ్వర్యంలోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA) వైద్య బృందం ఎట్టకేలకు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్‌కు ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో పంత్ త్వరలోనే వైజాగ్‌లో జ‌రిగే ఢిల్లీ శిక్షణా శిబిరంలో జట్టుతో క‌లువనున్నాడు.

రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో మృత్యుంజ‌యుడిగా బ‌య‌ట‌ప‌డిన‌  పంత్, ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఎన్‌సీఏలో రీహాబిలిటేష‌న్‌లో ఉండి కఠిన వ్యాయామాలు చేసి తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ  మునుపటి లయను అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీసీఐ వైద్య బృందం ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ కూడా ఇచ్చింది కనుక పంత్ రీఎంట్రీకి అడ్డంకులు తొలగిపోయాయి. 

బ్యాటింగ్ మాత్రమే.. నో కీపింగ్

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పంత్ రీఎంట్రీ కంఫర్మ్ అయినప్పటికీ.. అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది అనుమానంగా మారింది. పంత్ పూర్తిగా ఫిట్‌గా లేకుంటే అతన్ని కొంచెం భిన్నమైన పాత్రలో ఉపయోగించాల్సి ఉంటుందని ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ వెల్లడించారు. ఈ మాటలను బట్టి పంత్ ఢిల్లీ సారథ్య బాధ్యతలు చేపట్టక పోవచ్చని అర్థమవుతోంది. అలాగే, పంత్ మున‌ప‌టిలా వికెట్ కీపర్, బ్యాట‌ర్‌గా ఆడ‌డం క‌ష్టమే. అత‌నిపై ఎక్కువ భారం ప‌డ‌కుండా వికెట్ కీపింగ్ బాధ్యత‌లు మరొకరికి అప్పగించే అవకాశం ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్

మార్చి 22న ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభంకానుండగా.. తొలి పోరులో ఢిల్లీ జ‌ట్టు మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

  • మార్చి 23న: పంజాబ్ కింగ్స్‌తో
  • మార్చి 28న: రాజస్థాన్ రాయల్స్‌తో
  • మార్చి 31న: చెన్నై సూపర్ కింగ్స్‌తో 
  • ఏప్రిల్ 03న: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
  • ఏప్రిల్ 07న: ముంబై ఇండియన్స్‌తో