కర్తవ్యపథ్​పై ఆకట్టుకున్నతెలంగాణ శకటం

కర్తవ్యపథ్​పై ఆకట్టుకున్నతెలంగాణ శకటం

న్యూఢిల్లీ, వెలుగు :  కర్తవ్యపథ్​పై తెలంగాణ శకటం ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జరిగిన పోరాట స్మృతులను రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా దేశ ప్రజలకు చాటింది. తెలంగాణ ఔన్నత్యం, కట్టు, బొట్టు, సంస్కృతి, సంప్రదాయం తెలియజేస్తూ అందరినీ ఆకర్షించింది. ‘అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం’ థీమ్​తో రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించింది. ‘జన సామాన్య ప్రజాస్వామ్య యోధులు’గా కొమురంభీం, రాంజీ గోండ్, చాకలి ఐలమ్మల పోరాటాలు గుర్తుచేసింది.

అందెశ్రీ గేయం.. ‘జయ జయహే తెలంగాణ’ పదాలను శకటంపై ప్రదర్శించింది. మలిదశ పోరాటం గుర్తుచేసుకునేలా శకటాన్ని అధికారులు ముస్తాబు చేశారు. శకటం ప్రదర్శించే టైమ్​లో ప్లే అయిన ‘రేల రేల.. రేలారే..’ అనే సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ‘ప్రజాస్వామ్య జాతరే పునాదిగా నిలిచేరా’ అంటూ గాంధీ, సుభాష్ చంద్రబోస్, రాంజీగోండు, కొమురంభీం, చాకలి ఐలమ్మ, ఇతరులను కీర్తించేలా ఈ పాటను రూపొందించారు.