అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా మెకర్తీ

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా మెకర్తీ

వాషింగ్టన్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా రిపబ్లికన్ నేత కెవిన్ మెకర్తీ ఎన్నికయ్యారు. హౌస్ చాంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో 15 రౌండ్ల ఓటింగ్ తర్వాత ఆయన విజయం సాధించారు. చాంబర్‌‌‌‌‌‌‌‌లో రిపబ్లికన్లకు అవసరమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. సుదీర్ఘ ఓటింగ్ జరగాల్సి వచ్చింది. మెకర్తీ అభ్యర్థిత్వాన్ని కొందరు రిపబ్లికన్లు అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దీంతో మెకర్తీ 15వ రౌండ్ దాకా పోరాడాల్సి వచ్చింది. అయితే ఆలస్యంగానైనా కొందరు సభ్యులు తిరిగి మద్దతు తెలపడంతో మెకర్తీ గెలిచారు. ఆయన గెలిచినట్లు హౌస్ క్లర్క్ ప్రకటించడంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

తోటి సభ్యులను ఆలింగనం చేసుకుని మెకర్తీ తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతకుముందు చాంబర్‌‌‌‌‌‌‌‌లో వాడీవేడి సన్నివేశాలు జరిగాయి. మెకర్తీకి మద్దతుదారుడైన మైక్ రోజర్స్‌‌‌‌తో రెబల్ నేత మ్యాట్ గేడ్జ్ గొడవకు దిగారు. గేట్జ్‌‌‌‌ వైపు వేలు చూపిస్తూ ముందుకు రాగా.. ఆయన్ను రిచర్డ్ హడ్సన్ తదితరులు ఆపి, పక్కకి తీసుకెళ్లారు. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు సభలో స్వల్ప మెజారిటీ సాధించారు.

శుభాకాంక్షలు చెప్పిన బైడెన్

తన విజయానికి మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ సపోర్ట్ చేశారంటూ మెకర్తీ ట్వీట్ చేశారు. ‘‘మొదటి నుంచి ట్రంప్​ నా వెంటే ఉన్నారు” అని తెలిపారు. కాగా,  కెవిన్ మెకర్తీకి ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.