ఉద్యోగం చేసే భార్య ఇంటి ఖర్చు భరించాల్సిందే: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ఉద్యోగం చేసే భార్య ఇంటి ఖర్చు భరించాల్సిందే: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

కుటుంబ పోషణలో భార్యభర్తల బాధ్యతపై ముంబై  హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సంపాదించే భార్య ఇంటి ఖర్చులు భరించాలని భర్త అడగడం నేరం కాదని  తెలిపింది. ఉద్యోగం చేసే భార్యను తన జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం వాడుకోమని అడగడం చట్టవిరుద్ధమైన డిమాండ్‌గా కాదు, అది క్రూరత్వంగా గానీ పరిగణించలేమని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. నాగ్ ఫూర్ కు చెందిన ఓ వ్యక్తి పై గృహహింస చట్టం 498 కింద అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టిన కేసును విచారించిన కోర్టు వ్యాఖ్యలు చేసింది. 

భర్త, అత్తమామలు హింసించారంటూ ఐపీసీ సెక్షన్ 498 ఎ కింద, సెక్షన్ 504  నాగ్ పూర్ కు చెందిన వ్యక్తిపై అతని భార్య మంకాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈకేసులో బాధితుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ముంబై కోర్టులో నాగ్ పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వృషాలి జోషి  బాధితుడిపై దాఖలైన ఎఫ్ ఐఆర్, ఛార్జీషీట్ ను కొట్టివేశారు. 

అసలు ఏం జరిగిందంటే.. 

నాగ్ ఫూర్ కు చెందిన బాధితుడు మంకాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై భర్తపై గృహ హింస కేసు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారు భార్య తాను ఇంటిపనులు చేయడం లేదని జీతం ఇంట్లో అప్పగించాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితునిపై సెక్షన్ 498, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేశారు. అయితే బాధితుడి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ముంబై హైకోర్టును ఆశ్రయించారు .

 ఈ కేసును విచారించిన నాగ్ ఫూర్ బెంచ్ జస్టిస్  వృషాలి జోషి ..ఈ కేసులో సాక్ష్యాదారాలు పరిశీలించిన తర్వాత గృహహింస వేధింపులకు అవసరమైన సాక్ష్యాలను చూపించలేకపోయారని అభిప్రాయపడ్డారు. సంపాదించే భార్య ఇంటి ఖర్చులు భరించాలని కోరడం తప్పు కాదని తీర్పు చెప్పారు.