సోమయ్య రెండెకరాలున్న చిన్న రైతు. పొలంలోనే పూరి గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పెద్దగా పండేవి కాదు. వచ్చే డబ్బు తిండికే సరిపోయేది. అలాంటి సమయంలో రెండేళ్లు బాగా వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి. మంచి ఆదాయం వచ్చింది. వచ్చిన డబ్బుతో పెంకుటిల్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు. సొంతిల్లు అతని చిరకాల కోరిక. ఆ ఇల్లు కట్టేటప్పుడు పిచ్చుకల కోసమని వసారాలో గూళ్ళు కట్టించాడు. అలా కట్టించడం సోమయ్య కొడుకు రామయ్యకు ఇష్టం లేదు. ఆ మాటే తండ్రితో చెప్పాడు.
అందుకు సోమయ్య “తప్పురా! అలా అనకూడదు. చెట్లు, పక్షులు, జంతువుల వల్లే మనుషులు హాయిగా బతుకుతున్నారు. అవి నోరు తెరిచి మనల్నేమీ అడగలేవు. అందుకే మనమే వాటికి మేలు చేసే పనులు చేయాలి" అన్నాడు. రామయ్యకు ఇష్టం లేకపోయినా తండ్రికి ఎదురు చెప్పలేక ఏమీ మాట్లాడలేదు. ఇల్లు కట్టడం పూర్తయ్యింది. గూళ్ళల్లో చాలా పిచ్చుకలు వచ్చి చేరాయి. వాటికోసం వసారాలో వరి కంకుల్ని వేలాడదీశాడు సోమయ్య..సాయంత్రమైతే అవి గూళ్ళకు చేరి.. కిచకిచమని అరుస్తుంటే ఇల్లంతా సందడిగా వుండేది. పిల్లలకు ఎంతో సరదాగా వుండేది.
ఇలావుండగా ఆ ఏడాది చుట్టుపక్కల గ్రామాల్లో వరి పంటకు బాగా పురుగు పట్టింది. ఒకరోజు రామయ్య తండ్రితో దిగులుగా.. "ఈ సారి మంచి దిగుబడి వస్తుంది అనుకున్నా. ఇంతలోనే చుట్టుపక్కల ఊళ్లలో వరి పంటకు పురుగు పట్టింది. అది మన పంటకు వ్యాపిస్తుందని భయంగా ఉంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు” అంటూ బాధపడ్డాడు. ఆ మాటలకు సోమయ్య నిబ్బరంగా "కంగారుపడకు రామయ్య... మన లాగే మన ఊళ్లో రైతులందరూ పిచ్చుకలను వ్యవసాయ మిత్రులుగా భావించి ఇళ్ళల్లో గూళ్ళు కట్టి వసారాలో వరికంకులు పెట్టి వాటిని ఆత్మీయ అతిథులుగా చూస్తారు.
మన ఊళ్లో పిచ్చుకలు చాలా ఉన్నాయి. పొలాల్లో పురుగు జాడ కనిపిస్తే అవి వాటిని వేటాడి మరీ తినేస్తాయి. అందువల్ల మన పొలాలకు ఇప్పటివరకు ఎప్పుడూ పురుగు బెడద లేదు" అన్నాడు. ఆ మాటలకు రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత తండ్రి చెప్పినట్లే జరిగింది. పొలంలో పురుగు జాడ కనిపించగానే పిచ్చుకల దండు పొలాల మీద వాలి కొన్ని గంటల్లోనే పొలంలో ఉన్న పురుగుల్ని తినేశాయి.
పిచ్చుకలు సకాలంలో చేసిన మేలు కళ్ళారా చూసిన రామయ్య.. “నాన్నా! మీరన్నది వాస్తవం. పక్షులు, జంతువులు, చెట్లు లేనిదే మనం లేం. వాటి బాగోగులు చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అవి క్షేమంగా ఉంటే మనమూ క్షేమంగా వుంటాం" అన్నాడు. అప్పటినుంచి సాటి జీవుల మీద ప్రేమగా ఉంటూ మరిన్ని పిచ్చుకలు ఉండడానికి గూళ్ళు కట్టాడు రామయ్య. అది చూసి సోమయ్య చాలా సంతోషించాడు.
