ఆపరేషన్ స్మైల్ లో 19 మంది పిల్లల రెస్క్యూ

ఆపరేషన్ స్మైల్ లో 19 మంది పిల్లల రెస్క్యూ

కరీంనగర్, వెలుగు : జిల్లావ్యాప్తంగా జనవరి ఫస్ట్ నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ లో 19 మంది పిల్లలను రెస్క్యూ చేసినట్లు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్​ పర్సన్ ధనలక్ష్మి తెలిపారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, లేబర్, చైల్డ్ లైన్ 1098 ,సమగ్ర బాలల పరిరక్షణ పథకం(ఐసీపీఎస్), స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ ముగింపు సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, కే.విజయ్ కుమార్, రాధ, అర్చన రెడ్డి తో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు.

ప్రతి టీంలో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, ఐసీపీఎస్ స్టాఫ్, చైల్డ్ లైన్ 1098 ప్రతినిధి, లేబర్ ఆఫీసర్ సంయుక్తంగా జిల్లాలోని 16 మండలాల్లో నెల రొజులపాటు విస్తృతంగా తనిఖీలను నిర్వహించినట్లు తెలిపారు. కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ మండలాల్లోని వివిధ షాపులు, హోటళ్లు, దాబాల్లో పని చేస్తున్న 13 మంది అబ్బాయిలు, ఆరుగురు బాలికల గుర్తించినట్లు చెప్పారు.

వీళ్లలో తెలంగాణవారు 10 , బీహార్, చత్తీస్ గఢ్​ కు చెందిన పిల్లలు ముగ్గురు చొప్పున, రాజస్థాన్ కు చెందిన ఒకరు, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఉన్నట్లు వెల్లడించారు. వీరిని సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి వారి బంధువులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపారు. పనిలో పెట్టుకున్నవారిపై అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీసులు 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.