రూ.1,100 కోట్లు రిలీజ్పై హర్షం
ఖైరతాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర గురుకుల కాంట్రాక్టర్లు థ్యాంక్స్ చెప్పారు. తమకు రావాల్సిన రూ.1,100 కోట్ల బకాయిలను ఒకేసారి విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాస్ మాట్లాడారు.
రాష్ట్రంలోని గురుకులాలకు కావాల్సిన పప్పు, పాలు, కిరాణా, కూరగాయలు, గుడ్లు, స్టేషనరీ సరఫరా చేస్తున్నామని, తమ బకాయిలు విడుదల చేయాలని గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విన్నవించామన్నారు. అయితే, వారు చెప్పిన గడువు తేదీ కన్నా ముందే బకాయిలు విడుదల చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు విడుదల చేయలేదన్నారు. ఈ మీటింగ్ లో ఉపాధ్యక్షుడు ఆనంద్, సభ్యులు అశోక్, దుర్గా ప్రసాద్, రమేశ్, అజీం తదితరులు పాల్గొన్నారు.